అక్షరటుడే, హైదరాబాద్: Konda Surekha meet Megastar | మెగాస్టార్ చిరంజీవి ఇటీవల రాజకీయాలకు దూరంగా ఉంటూ.. వరుసగా సినిమాలు చేస్తూ వస్తున్నారు. కాగా, తాజాగా జూబ్లీహిల్స్ లోని చిరు నివాసానికి తెలంగాణ దేవాదాయ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ వెళ్లి ఆయనతో భేటీ కావడం తీవ్ర రాజకీయ చర్చకు దారితీసింది.
చిరంజీవిని కలిసిన సందర్భంగా కొండా సురేఖ.. ఆయనకు ఆంజనేయస్వామి చిత్రపటాన్ని బహూకరించారు. కాగా, ఈ భేటీలో సురేఖ కుమార్తె సుస్మిత సైతం పాల్గొన్నారు. వీరు మర్యాదపూర్వకంగానే కలుసుకున్నప్పటికీ.. మంత్రి సురేఖ ఈ మీటింగ్కు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ చిరుని కేంద్ర మాజీ మంత్రిగా పేర్కొనడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.
Konda Surekha meet Megastar | రాజకీయ నేపథ్యం..
ప్రజారాజ్యం రాజకీయ పార్టీ స్థాపన.. తర్వాత కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడం.. తదుపరి రాజ్యసభ సభ్యుడిగా నియామకం, అటు పిమ్మట కేంద్ర మంత్రిగా బాధ్యతలు.. ఇలా చిరు రాజకీయ నేపథ్యం సాగినా.. ప్రస్తుతం ఆయన పూర్తిగా సినీలోకానికే పరిమితం అయ్యారు.
ఇలాంటి తరుణంలో తెలంగాణలో కీలక మంత్రి ఇలా చిరుతో భేటీ కావడం రాజకీయ చర్చకు దారితీసింది. అయితే, సోషల్ మీడియాలో నెటిజన్లు భిన్న కోణాల్లో స్పందిస్తున్నారు. రామ్ చరణ్–ఉపాసనలకు కవల పిల్లలు పుట్టినందున శుభాకాంక్షలు చెప్పేందుకని ఒకరు.. కొండా సుస్మిత చిరు అభిమానిని కావడం వల్ల ఆయనను కలిసినట్లు మరొకరు.. ఇలా తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు.