అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Konda Surekha | మంత్రి పదవి చేపట్టిన నాటి నుంచి కొండా సురేఖ తీరు రోజురోజుకూ వివాదాస్పదమవుతోంది. ఆమె పార్టీలో ప్రవర్తిస్తున్న తీరు కారణంగా అటు ప్రభుత్వం, ఇటు కాంగ్రెస్ పార్టీ (Congress Party) ఇరకాటంలో పడుతున్నాయి.
తాజాగా గురువారం నిర్వహించిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశానికి గైర్హాజరు కావడం పార్టీలో మరింత చర్చనీయాంశమైంది. కేబినెట్ మీటింగ్‌కు (Cabinet Meeting) ముందు.. ఆమె డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో భేటీ అయ్యారు. అనంతరం ఆమె సచివాలయంలో మీటింగ్‌లో పాల్గొనకుండా బయటకు వెళ్లిపోయారు.
Konda Surekha | ఆది నుంచి వివాదాస్పద వైఖరి..
గతంలో ఓ హీరోయిన్ విషయంలో కొండా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అనంతరం ఆమె భర్త కొండా మురళి (Konda Murali) సొంత పార్టీ ఎమ్మెల్యేలపైనే ఆరోపణలు చేశారు. దీంతో వరంగల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇప్పటికే కొండా సురేఖకు వ్యతిరేకంగా ఏకం అయ్యారు. ఇటీవల ఆమె భర్త మురళి పొంగులేటిపై హైకమాండ్‌కు ఫిర్యాదు చేయడంతో వార్తల్లో నిలిచారు.
కాగా.. మంత్రి కొండా సురేఖ (Konda Surekha) ఇంటి వద్ద బుధవారం రాత్రి హైడ్రామా చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఆమె ఇంటికి వచ్చిన టాస్క్‌ఫోర్స్ పోలీసులను మంత్రి కుమార్తె సుష్మిత అడ్డుకున్నారు. కొండా సురేఖ ఓఎస్డీ సుమంత్‌ను ప్రభుత్వం ఇటీవల తొలగించారు. ఆయనపై పలు ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో సుమంత్ మంత్రి ఇంట్లో ఉన్నారని తెలుసుకున్న పోలీసులు ఆయనను అరెస్ట్ చేయడానికి వెళ్లారు. వారిని గేటు వద్దే మంత్రి కుమార్తె అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాశమైంది. ఇలా తరచూ తలెత్తుతున్న వివాదాలు కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారాయి.