అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Munugodu MLA | మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో వరదలు తలెత్తి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం అక్కడ ఉండాల్సింది పోయి ఇక్కడ ఉండడం సరికాదన్నారు.
వరదల(Floods)తో రాష్ట్ర ప్రజలు ఇబ్బందులు పడుతూ కష్టాల్లో ఉన్న సమయంలో అసెంబ్లీకి రావడం ఇష్టం లేదని ఆయన అన్నారు. తాను ఇక నుంచి అసెంబ్లీకి రానని చెప్పారు. శనివారం అసెంబ్లీ సమావేశాల (Assembly Sessions) ప్రారంభానికి ముందు గన్‌పార్కు అమరవీరుల స్థూపం వద్ద తన అనుచరులతో కలిసి రాజ్‌గోపాల్‌రెడ్డి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు(శనివారం) మాత్రమే అసెంబ్లీకి వస్తానని ఆయన స్పష్టం చేశారు. రేపటి నుంచి వరద బాధిత ప్రాంతాల్లో పర్యటిస్తానని ప్రకటించారు.
Munugodu MLA | పదవి శాశ్వతం కాదు..
పదవి ఎవరికీ శాశ్వతం కాదని మునుగోడు ఎమ్మెల్యే పేర్కొన్నారు. మంచి వ్యక్తిత్వం, సేవ చేయాలనే గుణమే శాశ్వతమని తెలిపారు. సేవాగుణం చచ్చేవరకూ ఉంటుందని, కానీ.. పదవి ఉండదని వ్యాఖ్యానించారు. వదర బాధిత ప్రాంతాల్లో తాను పర్యటిస్తానని, ఎమ్మెల్యేగా కాకుండా ఒక వ్యక్తిగా సహాయం చేస్తానని చెప్పారు. ప్రభుత్వమే అన్నీ చేయాలంటే కూడా సాధ్యం కాదని పేర్కొన్నారు. వరదలతో రాష్ట్ర ప్రజలు ఇబ్బందులు పడుతూ కష్టాల్లో ఉండగా.. అసెంబ్లీకి రావడం ఇష్టం లేదని ఆయన అన్నారు. మెదక్(Medak), కామారెడ్డి(Kamareddy) వరద బాధితులకు అండగా ఉంటానని ప్రకటించారు. అసెంబ్లీలో ఇదే నా చివరి రోజని, ఇక నుంచి ప్రజల్లోనే ఉంటానని రాజ్ గోపాల్ రెడ్డి అన్నారు.