Telangana Congress
Telangana Congress | ఉత్త‌మ్‌పై కోమ‌టిరెడ్డి అస‌హ‌నం?.. న‌ల్ల‌గొండ వెళ్ల‌కుండానే తిరుగుముఖం

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Telangana Congress | రాష్ట్ర మంత్రివ‌ర్గంలోని స‌హ‌చ‌రుల మ‌ధ్య అభిప్రాయ భేదాలు ఉన్న‌ట్లు ఎప్ప‌టి నుంచో ప్ర‌చారం జ‌రుగుతోంది. ముఖ్య‌మంత్రికి, కొంద‌రు మంత్రుల న‌డుమ‌ గ్యాప్ ఉంద‌ని విప‌క్షాలు సైతం ఆరోపిస్తున్నాయి. కానీ అవేమీ లేవ‌ని తామంతా ఏక‌తాటిపైనే ఉన్నామ‌ని కాంగ్రెస్ ప్ర‌భుత్వం (Congress government) ఖండిస్తూనే వ‌స్తున్న‌ది. అయితే, తాజాగా బేగంపేట ఎయిర్‌పోర్టు (Begumpet Airport) వేదిక‌గా ఇద్ద‌రు మంత్రుల మ‌ధ్య విభేదాలు వెలుగులోకి వ‌చ్చాయి.

Telangana Congress | ఆల‌స్యంగా వ‌చ్చిన ఉత్త‌మ్‌

నాగార్జున సాగ‌ర్ పూర్తి స్థాయిలో నిండ‌డంతో గేట్లు ఎత్తాల‌ని నిర్ణ‌యించారు. గేట్లు ఎత్తే కార్య‌క్ర‌మానికి మంత్రులు ఉత్త‌మ్‌కుమార్‌ రెడ్డి (Minister Uttam Kumar Reddy), కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి (Komatireddy venkat reddy), జిల్లా ఇన్‌చార్జి మంత్రి అడ్లూరి ల‌క్ష్మ‌ణ్ వెళ్లాల‌ని నిర్ణ‌యించారు. గేట్లు ఎత్త‌డానికి మంగ‌ళ‌వారం 10 గంట‌ల‌కు ముహూర్తం నిర్ణ‌యించారు. అయితే, ఉద‌యం 9 గంట‌ల‌కే హైద‌రాబాద్ నుంచి హెలికాప్ట‌ర్‌లో బ‌య‌ల్దేరాల‌ని మంత్రుల‌కు స‌మాచారం అందింది. 9 గంట‌ల‌కే బేగంపేట విమానాశ్ర‌యానికి చేరుకోవాల‌ని స‌మాచార‌మిచ్చారు. ఆ స‌మ‌యానికే మంత్రులు కోమ‌టిరెడ్డి, వ‌డ్లూరి ల‌క్ష్మ‌ణ్ చేరుకున్నారు. కానీ ఉత్త‌మ్ రాలేదు.

Telangana Congress | అలిగిన కోమ‌టిరెడ్డి..

షెడ్యూల్ ప్రకారం ఉదయం 9 గంటలకే మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ బేగంపేట ఎయిర్​పోర్టుకు చేరుకోగా, ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి రాలేదు. 10 గంటలు దాటినా ఇరిగేషన్ మంత్రి రాక‌పోవ‌డంతో కోమ‌టిరెడ్డి తీవ్ర అస‌హ‌నానికి లోన‌య్యారు. తమను ఉదయం 9 గంటలకే ఎయిర్​పోర్టుకు రావాలని చెప్పిన ఉత్తమ్ 10 గంటలకు ఎలా వస్తాడని కోమటిరెడ్డి ఆగ్రహం వ్య‌క్తం చేశారు. ఉత్తమ్ ఆలస్యంపై అలిగిన మంత్రి కోమటిరెడ్డి బేగంపేట్ ఎయిర్‌పోర్టు నుంచి వెళ్లిపోయారు. దీంతో ఆయ‌న లేకుండానే హెలికాప్టర్‌లో మంత్రులు ఉత్తమ్, లక్ష్మణ్ నాగార్జునసాగర్‌కు (Nagarjuna sagar) బయలుదేరి వెళ్లారు.