అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Virat Kohli | భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ భవిష్యత్తుపై నెలలుగా కొనసాగుతున్న ఊహాగానాలకు తెరపడింది. కొన్నాళ్లుగా కోహ్లీ రిటైర్మెంట్ (Kohli Retirement)పై అనేక వార్తలు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. దీనిపై క్లారిటీ లేకపోయే సరికి అభిమానులు టెన్షన్‌లో ఉన్నారు.
ఈ క్రమంలో మాజీ ఆటగాడు దినేష్ కార్తీక్ ఓ కీలక వ్యాఖ్య చేశాడు. కోహ్లీ 2027లో జరగబోయే వన్డే ప్రపంచ కప్‌లో ఆడాలని పకడ్బందీగా నిర్ణయించుకున్నాడని ఆయన వెల్లడించాడు. ప్రస్తుతం కోహ్లీ శిక్షణలో ఉన్న ప్రధాన లక్ష్యం అదే అని కార్తీక్ స్పష్టం చేశాడు. ఇటీవలి కాలంలో కోహ్లీ కేవలం వన్డే ఫార్మాట్‌పైనే దృష్టి సారించడం, అలాగే రోహిత్ శర్మతో కలిసి ఆస్ట్రేలియా సిరీస్ (Australia Series)తో తిరిగి జట్టులో చేరబోతున్న నేపథ్యంలో ఈ సమాచారం క్రికెట్ అభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది.
Virat Kohli | కోహ్లీ సంకల్పం పటిష్ఠం
తన ఇన్‌స్టాగ్రామ్ వీడియోలో దినేష్ కార్తీక్ మాట్లాడుతూ.. “విరాట్‌కి 2027 ప్రపంచ కప్ ఆడడం ప్రధాన లక్ష్యం. ఆ దిశగా అతను ఇప్పటికే సిద్ధమవుతున్నాడు. సుదీర్ఘ విరామం తీసుకున్నప్పటికీ తన ఫిట్‌నెస్, బ్యాటింగ్ ప్రాక్టీస్‌పై ఒక్కరోజు కూడా నిర్లక్ష్యం చేయలేదు” అని తెలిపారు. లండన్‌లో ఉన్నప్పుడు కూడా కోహ్లీ వారానికి రెండు నుంచి మూడు ప్రాక్టీస్ సెషన్లు క్రమం తప్పకుండా చేస్తున్నాడు. అతనిలో ఉన్న ప్యాషన్ చూసి నేను ఆశ్చర్యపోయాను. ఇది అతని అంకితభావానికి నిదర్శనం అని దినేష్ కార్తీక్ స్పష్టం చేశాడు. కోహ్లీ మళ్లీ ప్రపంచ కప్ (World Cup)ఆడాలని ఉత్సాహంగా ఉన్నాడని, అతను జట్టులో ఉంటే భారత ఆటగాళ్లకు ధైర్యం కలుగుతుందని కార్తీక్ పేర్కొన్నాడు.
ప్రెషర్ సిట్యుయేషన్‌లో ఎలా ఆడాలో, టీమ్ కోసం ఎలా ఫైట్ చేయాలో కోహ్లీ (Virat Kohli)కి బాగా తెలుసు. అతను దానిని ఎన్నిసార్లు చేసి చూపించాడు. కాబట్టి ఈ సారి కూడా అదే స్థాయి ప్రదర్శన ఇస్తాడనే నమ్మకం నాకు ఉంది” అని ధీమా వ్యక్తం చేశాడు. దినేష్ కార్తీక్ (Dinesh Karthik)వ్యాఖ్యలతో 2027 వన్డే ప్రపంచ కప్ (దక్షిణాఫ్రికా, నమీబియా, జింబాబ్వే సంయుక్త ఆతిథ్య దేశాలుగా నిర్వహించనున్న టోర్నమెంట్)లో కోహ్లీ పాల్గొంటాడా అనే సందేహాలకు తాత్కాలికంగా తెరపడినట్టయింది. ఇదే సమయంలో కోహ్లీ కూడా తన ట్వీట్‌తో పుకార్లకి చెక్ పెట్టాడు. సింగిల్ లైన్‌లో తాను చెప్పాలనుకున్నది ఖరాఖండీగా చెప్పేశాడు. నిజంగా నువ్వు ఓడిపోయేది ఎప్పుడో తెలుసా, నీవు ప్రయత్నం మానేసినప్పుడు అని కామెంట్ చేశాడు. అంటే తాను ఇప్పట్లో రిటైర్ అయ్యేది లేదని ఇన్‌డైరెక్ట్‌గా చెప్పినట్టుగా ముచ్చటించుకుంటున్నారు.