అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Jubilee Hills by-Election | హైదరాబాద్ (Hyderabad)లోని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో అప్రతిహత భద్రతా చర్యలు తీసుకున్నప్పటికీ, ఊహించని ఘటన చోటుచేసుకుంది. ఎన్నికల అక్రమాలను పర్యవేక్షించడానికి ఉపయోగించిన నిఘా డ్రోన్లను గుర్తుతెలియని దుండగులు గాలిపటాలను వినియోగించి కూల్చివేయడం సంచలనం సృష్టించింది.
దేశంలోనే తొలిసారిగా ఎన్నికల పర్యవేక్షణ కోసం డ్రోన్లు మోహరించగా, ఇలాంటి సంఘటన వెలుగుచూడడం ఆందోళన కలిగిస్తోంది.తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన 139 మంది లైసెన్స్ పొందిన డ్రోన్ పైలట్లు (Drone Pilots) ఎన్నికల విధుల్లో నియమించబడ్డారు.
Jubilee Hills by-Election | డ్రోన్లపై దాడి..
వీరు పోలింగ్ కేంద్రాల చుట్టూ 3 కి.మీ. పరిధిలో నిఘా బాధ్యతలు నిర్వర్తించారు. అయితే, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని రహమత్‌నగర్ (Rahmatnagar)లో రెండు, కార్మిక నగర్‌లో రెండు, మధురానగర్ మరియు షేఖ్‌పేటలో ఒక్కొక్కటి చొప్పున మొత్తం ఆరు డ్రోన్లు గాలిపటాల వలన కూలిపోయినట్టు సమాచారం. ఒక్కో డ్రోన్ విలువ సుమారు రూ. 2.5 లక్షలు కాగా, మొత్తం రూ. 15 లక్షల వరకు నష్టం జరిగినట్లు అధికారులు వెల్లడించారు. ఈ డ్రోన్లు మూడు బ్యాటరీలతో నిరంతరంగా మూడు గంటల పాటు ఎగరగల సామర్థ్యం కలిగి ఉన్నాయి. వీటి ద్వారా లభించిన లైవ్ ఫీడ్‌ను కమాండ్ సెంటర్‌లో అధికారులు పర్యవేక్షిస్తూ ఉన్నారు.
ఈ దాడుల సమయంలో కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు డ్రోన్ ఆపరేటర్లను (Drone Operators) బెదిరించారని, డ్రోన్లను లాక్కోవడానికి ప్రయత్నించారని సమాచారం. దీంతో ఓటింగ్ సమయంలో దొంగ ఓట్లు పడినాయా? లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇక ఓటింగ్ విషయానికి వస్తే, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక (Jubilee Hills by-Election)లో మొత్తం 48.47% పోలింగ్ నమోదైంది. నవంబర్ 14న లెక్కింపు జరగనుంది. పోలింగ్ అనంతరం విడుదలైన ఎగ్జిట్ పోల్స్ ప్రకారం, కాంగ్రెస్ (Congress), బీఆర్‌ఎస్ (BRS) మధ్య గట్టి పోటీ నెలకొన్నట్లు అంచనా. చాలా సర్వేలు కాంగ్రెస్ పార్టీకే స్వల్ప ఆధిక్యం చూపిస్తున్నాయి. విశ్లేషకుల అంచనా ప్రకారం, కాంగ్రెస్ 3% నుండి 8% ఓట్ల తేడాతో గెలుపొందే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.ఈ సంఘటనతో ఎన్నికల భద్రతా వ్యవస్థపై ప్రశ్నలు తలెత్తగా, పోలీసులు డ్రోన్లు కూలిన ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు.
