అక్షరటుడే, వెబ్‌డెస్క్: Kitchen sink | వంటగదిలో మనం ప్లేట్లను ఎంత శుభ్రంగా కడుగుతామో.. ఆ పాత్రలు తోమే ‘సింక్’ విషయంలో కూడా అంతే శ్రద్ధ వహించాలి. సాధారణంగా అందరూ పాత్రలు తోమడంపైనే దృష్టి పెడతారు.. కానీ, సింక్ పరిశుభ్రతను విస్మరిస్తుంటారు.
నిజానికి కిచెన్ సింక్ అనేది బాక్టీరియా, క్రిములకు నిలయంగా మారుతుంది. ఆహార వ్యర్థాలు, నూనె జిడ్డు పేరుకుపోవడం వల్ల సింక్ క్రమంగా తన మెరుపును కోల్పోయి, అసహ్యకరమైన దుర్వాసనను వెదజల్లుతుంటుంది. బయట మార్కెట్లో దొరికే ఖరీదైన కెమికల్ క్లీనర్లు వాడాల్సిన పని లేకుండా, ఇంట్లో ఉండే సహజ సిద్ధమైన వస్తువులతోనే సింక్‌ను అద్దంలా ఎలా మెరిపించవచ్చో ఇక్కడ తెలుసుకుందాం.
Kitchen sink | కిచెన్ సింక్ మెరవాలంటే ఇలా చేయండి.
చాలామంది స్టెయిన్లెస్ స్టీల్ సింక్‌ను క్లీన్ చేయడానికి స్టీల్ స్క్రబ్బర్లు, వైర్ బ్రష్‌లు వాడుతుంటారు. దీనివల్ల సింక్ మీద గీతలు పడి, అది పాతదానిలా కనిపిస్తుంది. అలాగే బ్లీచింగ్ పౌడర్ వంటివి వాడితే స్టీల్ రంగు మారిపోతుంది. దీనికి బదులుగా కింద పేర్కొన్న పద్ధతిని పాటించండి.
ప్రాథమిక శుభ్రత: మొదట సింక్‌లో ఉన్న పాత్రలను తీసేసి, ఆహార వ్యర్థాలు ఏవీ లేకుండా శుభ్రం చేయండి. ఏదైనా డిష్ వాషింగ్ లిక్విడ్ ఉపయోగించి పైన ఉన్న జిడ్డును ఒకసారి కడిగేయండి.
బేకింగ్ సోడా: తడిగా ఉన్న సింక్ అంతటా బేకింగ్ సోడాను చల్లండి. ఒక పాత టూత్ బ్రష్ సహాయంతో సింక్ మూలలు, నల్లా దగ్గర ఉండే ఇరుకైన ప్రదేశాలను బాగా రుద్దండి. బేకింగ్ సోడా మొండి మరకలను తొలగించడమే కాకుండా స్టీల్ కు మంచి షైనింగ్‌ను ఇస్తుంది. దీనిని 10 – 15 నిమిషాల పాటు అలాగే వదిలేయాలి.
వెనిగర్: సింక్ డ్రెయిన్ హోల్ నుంచి ఒక్కోసారి మురుగు వాసన వస్తుంది. దీన్ని నివారించడానికి అర కప్పు బేకింగ్ సోడా వేసి, దానిపై ఒక కప్పు వెనిగర్ పోయండి. ఆ తర్వాత కొన్ని ఐస్ ముక్కలు వేసి వేడి నీటిని పోస్తే, పైపుల్లో పేరుకుపోయిన మురికి క్లీన్ అయిపోయి వాసన రాకుండా ఉంటుంది.
పొడి వస్త్రంతో తుడవడం: సింక్ కడిగేసిన తర్వాత దానిని అలాగే వదిలేయకూడదు. నీటి చుక్కలు ఆరిపోతే మళ్లీ తెల్లటి మరకలు కనిపిస్తాయి. కాబట్టి, ఒక పొడి మైక్రోఫైబర్ క్లాత్, మెత్తని గుడ్డతో తుడవండి. అప్పుడు మీ సింక్ షోరూమ్ లోని కొత్త సింక్ లాగా మెరుస్తుంది.
వారానికి కనీసం రెండు సార్లు ఈ చిట్కాలను పాటిస్తే వంటగది ఎప్పుడూ పరిశుభ్రంగా, ఆరోగ్యకరంగా ఉంటుంది.