అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Vijay Mallya | కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్(Kingfisher Airlines)ను కాపాడుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశానని, ఫలితం లేకపోయిందని పరారీలో ఉన్న ప్రముఖ వ్యాపారవేత్త, ఆ ఎయిర్ లైన్స్ అధిపతి విజయ్ మాల్యా తాజాగా వెల్లడించారు.
2008 నాటి ప్రపంచ ఆర్థిక సంక్షోభమే ఎయిర్ లైన్స్ పతనానికి కారణమైందని తెలిపారు. మోసం, మనీలాండరింగ్ (fraud and money laundering) ఆరోపణలు ఎదుర్కొంటున్న విజయ్ మాల్యా.. యూట్యూబర్ రాజ్ షమానీతో (YouTuber Raj Shamani) జరిగిన పాడ్ కాస్ట్ కార్యక్రమంలో కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ పతనానికి దారి తీసిన కారణాలు వెల్లడించారు. తన విమానయాన సంస్థను కాపాడేందుకు సంస్థ పరిమాణాన్ని తగ్గించాలనే ప్రణాళికతో అప్పటి ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీని (Finance Minister Pranab Mukherjee) సంప్రదించినట్లు తెలిపారు. కానీ, తన అభ్యర్థనకు వ్యతిరేకత ఎదురైందని చెప్పుకొచ్చారు.
Vijay Mallya | ఆర్థిక సంక్షోభమే ముంచింది..
తన ఎయిర్ లైన్స్ మునిగి పోవడానికి 2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభమే కారణమని మాల్యా తెలిపారు. కింగ్ఫిషర్ ఎయిర్ లైన్స్ (Kingfisher Airlines) 2008 వరకు సజావుగా పనిచేశాయని, కానీ ప్రపంచ ఆర్థిక సంక్షోభం ప్రారంభంతో పరిస్థితి తీవ్రంగా మారిందన్నారు. ఆర్థిక మాంద్యం భారతదేశంపై గణనీయమైన ప్రభావాన్ని చూపిందని, ఇది ఆర్థిక వ్యవస్థలోని దాదాపు ప్రతి రంగాన్ని ప్రభావితం చేసిందని వివరించారు. “డబ్బు ఆగిపోయింది. భారత రూపాయి విలువ కూడా దెబ్బతింది” అని మాల్యా చెప్పారు.
Vijay Mallya | కేంద్రం నుంచి సహకారం లేదు..
2005లో ప్రారంభమైన కింగ్ఫిషర్ ఎయిర్ లైన్స్ (Kingfisher Airlines).. అద్భుతమైన సేవలతో బాగా పేరొందింది. ప్రీమియం సేవలకు ప్రశంసలు అందుకుంది. అయితే, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడంతో ఆ సంస్థకు ఆర్థిక ఇబ్బందులు పెరిగాయి. ఈ నేపథ్యంలో దిగజారుతున్న ఆర్థిక పరిస్థితిని గుర్తించి, కింగ్ ఫిషర్ కార్యకలాపాలను కుదించడానికి అనుమతి కోరుతూ ప్రణబ్ ముఖర్జీని సంప్రదించానని మాల్యా వెల్లడించారు.
“నేను అప్పటి ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ వద్దకు వెళ్లి. నాకు ఒక సమస్య ఉందని చెప్పాను. ఈ ఆర్థిక మాంద్యంలో పని చేయలేనందున కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ కంపెనీ విమానాల (Kingfisher Airlines company aircraft) సంఖ్యను తగ్గించాలి, ఉద్యోగులను కూడా తొలగించాలని చెప్పానని” వివరించారు. అయితే, తన విజ్ఞప్తిని కేంద్రం తిరస్కరించిందని మాల్యా వెల్లడించారు. “విమానాలు, ఉద్యోగులను తగ్గించవద్దని నాకు చెప్పారు. మీరు కంటిన్యూ చేయండి. బ్యాంకులు మీకు మద్దతుగా నిలుస్తాయని” హామీ ఇచ్చారన్నారు. ఈ హామీలు ఉన్నప్పటికీ, పెరుగుతున్న ఆర్థిక ఇబ్బందుల మధ్య కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ చివరికి అన్ని విమానాలను నిలిపి వేయాల్సి వచ్చిందని మాల్యా తెలిపారు.
Vijay Mallya | విచారణకు సిద్ధంగా ఉన్నా..
పాడ్ కాస్ట్ (podcast) కార్యక్రమంలో మాల్యా.. తన ఆర్థిక లావాదేవీల చుట్టూ ఉన్న ఆరోపణలను కూడా ప్రస్తావించారు. బాకీ ఉన్నదాని కంటే ఎక్కువగా చెల్లించినప్పటికీ, దొంగ అని ముద్ర వేయడాన్ని ఆయన ఖండించారు. తప్పు చేసినందుకు కాదు, చెడు ఉద్దేశాల ఆరోపణలపై విచారణకు సిద్ధంగా ఉన్నానని ఆయన వెల్లడించారు. తిరిగి చెల్లించాలనే స్పష్టమైన ఉద్దేశ్యం ఉన్నప్పటికీ, బ్యాంకులకు నాలుగు పరిష్కార ఆఫర్స్ ఇచ్చానని పేర్కొన్నారు.
కానీ బ్యాంకుల నుంచి పారదర్శకత లేకపోవడాన్ని ఆయన విమర్శించారు. 15 సార్లు రిమైండర్లు ఇచ్చినప్పటికీ తనకు అధికారిక ఖాతా స్టేట్మెంట్ ఎప్పుడూ రాలేదని, మొత్తం రూ.14,131.6 కోట్ల రుణం చెల్లించాలని పార్లమెంటులో ఆర్థిక మంత్రి (Finance Minister) ప్రకటన ద్వారా మాత్రమే వెల్లడైందని చెప్పారు. డెట్ రికవరీ ట్రిబ్యునల్ సర్టిఫికేట్ ను ఉటంకిస్తూ రూ.9,000 కోట్ల రుణం గురించి మీడియా నివేదికలను మాల్యా తోసిపుచ్చారు. డాక్యుమెంట్ చేయబడిన సంఖ్య రూ.6,203 కోట్లు అని నొక్కి చెప్పారు. బాకీ ఉన్న దానికంటే ఎక్కువ తిరిగి చెల్లించినప్పటికీ “దొంగ” అని ముద్ర వేయడాన్ని కూడా ఆయన ప్రశ్నించారు.