Homeజిల్లాలుసూర్యాపేటSuryapeta | నకిలీ పత్రాలు సృష్టించి కిడ్నీ మార్పిడి.. ఆరుగురి అరెస్ట్​

Suryapeta | నకిలీ పత్రాలు సృష్టించి కిడ్నీ మార్పిడి.. ఆరుగురి అరెస్ట్​

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Suryapeta | రాష్ట్రంలో అక్రమార్కులు వివిధ రకాలుగా మోసాలకు పాల్పడుతున్నారు. అమాయకులే లక్ష్యంగా మోసాలు చేస్తూ డబ్బులు దండుకుంటున్నారు. తమ నిర్వాకం బయటపడే సమయంలో జంప్​ అవుతున్నారు. తాజాగా రాష్ట్రంలో మరో భారీ మోసం బయట పడింది. కిడ్నీ మార్పిడి (kidney transplant) పేరిట కొందరు ఓ అమాయకుడిని నమ్మించి మోసం చేశారు.

సూర్యాపేట జిల్లా (Suryapet district) కోదాడకు చెందిన ఓ వ్యక్తికి రెండు కిడ్నీలు పాడయిపోయాయి. దీంతో చికిత్స కోసం విజయవాడలోని అమెరికన్​ కిడ్నీ సెంటర్​కు (American Kidney Center) వెళ్లాడు. అక్కడ కొందరు వ్యక్తులు ఆయనకు పరిచయం అయ్యారు. నిబంధనల మేరకు కిడ్నీ మార్పిడి చేయిస్తామని బాధితుడిని నమ్మించారు. విజయవాడలోని (Vijayawada) కనుమూరుకు చెందిన తాతారావు అనే వ్యక్తి చట్ట ప్రకారం కిడ్నీ మార్పిడి చేయిస్తామని.. తర్వాత ఏ ఇబ్బందులు రాకుండా చూస్తామని హామీ ఇచ్చారు. దీంతో వారి మాటలు నమ్మిన బాధితుడు రూ.12 లక్షలు ఇచ్చాడు.

అయితే భారత చట్టాల (Indian laws) ప్రకారం రక్త సంబంధీకుల కిడ్నీ మార్చడానికి మాత్రమే అవకాశం ఉంటుంది. కిడ్నీ ఇచ్చిన వ్యక్తి డబ్బులు తీసుకోకూడదు. ఈ నిబంధనలు బాధితుడికి తెలియవు. దీంతో తాతారావు, ఎన్​టీఆర్​ కృష్ణాజిల్లాకు (Krishna district) చెందిన కొండం రమాదేవితో కలిసి నకిలీ పత్రాలను సృష్టించాడు. రమాదేవి ఫార్మసిస్ట్​గా పనిచేస్తోంది. కిడ్నీ దాత గ్రహీత మధ్య రక్తం సంబంధం ఉన్నట్లు ఫోర్జరీ డాక్యుమెంట్లు తయారు చేశాడు. అనంతరం ఆ పత్రాలను ఆస్పత్రిలో సమర్పించడంతో గత డిసెంబర్​లో కిడ్నీ మార్పిడీ చేశారు. అయితే ఈ విషయమై సూర్యాపేట డిప్యూటీ డీఎంహెచ్​వోకు ఇటీవల ఫిర్యాదు అందింది. దీంతో ఆమె పోలీసులకు సమాచారం ఇవ్వగా కేసు నమోదు చేసి, దర్యాప్తు చేశారు. దర్యాప్తులో భాగంగా నకిలీ పత్రాలతో కిడ్నీ మార్పిడి చేసినట్లు గుర్తించారు. తాతారావు, రమాదేవితో పాటు వారికి సహకరించిన మరో నలుగురు వ్యక్తులను సైతం సూర్యాపేట పోలీసులు అరెస్ట్​ చేశారు. ఈ విషయంలో ఆస్పత్రికి సైతం నోటీసులు ఇచ్చి విచారణ చేస్తామన్నారు. వారి ప్రమేయం ఏమైనా ఉందా.. నిబంధనల మేరకే ఆపరేషన్​ చేశారా అని విచారిస్తామని పోలీసులు తెలిపారు.

Must Read
Related News