అక్షరటుడే, హైదరాబాద్: Kidney failure | మన దేశానికి వెన్నెముక వంటి రైతులు, నిర్మాణ కార్మికులు, ఇటుక బట్టీ కార్మికులు ఎండలో ఎక్కువ సమయం పనిచేయడం వల్ల దీర్ఘకాలిక మూత్రపిండాల వైఫల్యానికి (Chronic Kidney Failure) గురయ్యే ప్రమాదం ఉందని ప్రఖ్యాత లాన్సెట్ (Lancet) మ్యాగజైన్ ప్రచురించిన తాజా సర్వే హెచ్చరిస్తోంది. అధిక వేడికి గురైనప్పుడు శరీరంలో నీటి శాతం వేగంగా తగ్గిపోవడం (Dehydration) వల్ల కిడ్నీలు తీవ్రంగా దెబ్బతింటున్నాయని మద్రాస్ మెడికల్ కాలేజీ (MMC) మాజీ యూరాలజీ విభాగ అధిపతి డాక్టర్ గోపాల కృష్ణన్ నేతృత్వంలోని బృందం నిర్వహించిన ఈ పరిశోధన తేల్చింది.
Kidney failure | పరిశోధన వివరాలు , హెచ్చరిక:
మద్రాస్ మెడికల్ కాలేజీ యూరాలజీ విభాగం 2023 ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో తమిళనాడులోని 125 గ్రామాలకు చెందిన 3,350 మంది రైతులపై క్షేత్రస్థాయి సర్వే నిర్వహించింది. వారి మూత్రపిండాల పనితీరును పరీక్షించినప్పుడు, ఆశ్చర్యకరంగా 17.3 శాతం మందిలో మూత్రపిండాలు దెబ్బతిన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు.
మళ్లీ మూడు నెలల తర్వాత పరీక్షించగా, ఈ శాతం 5.31కి తగ్గింది. అయితే, వీరిలో చాలామందికి మధుమేహం (Diabetes), అధిక రక్తపోటు (High Blood Pressure), గుండె జబ్బులు లేదా ఇతర జన్యుపరమైన రుగ్మతలు లేవని నిర్ధారించారు. అంటే, కేవలం ఎండ ప్రభావం ,దాని వల్ల కలిగే వేడి ఒత్తిడి (Heat Stress) కారణంగానే కిడ్నీ వైఫల్యానికి గురవుతున్నారు.
రైతులు, నిర్మాణరంగ కార్మికులు వంటి వారు నిత్యం ఎక్కువ గంటలు వేడి ప్రదేశాలలో పనిచేసినప్పుడు, శరీరం నుంచి అధికంగా నీరు కోల్పోతారు. ఈ డీహైడ్రేషన్ వల్ల మూత్రపిండాలు తీవ్ర ఒత్తిడికి లోనై, క్రమంగా వాటి పనితీరు దెబ్బతింటుంది.
ఈ సర్వే ఫలితం గ్రామీణ , శ్రమ ఆధారిత ప్రాంతాలలో పనిచేసే ప్రజారోగ్యంపై తీవ్రంగా దృష్టి సారించాల్సిన అవసరాన్ని సూచిస్తోంది. వేడి వాతావరణంలో పనిచేసే కార్మికులకు తరచుగా నీరు అందుబాటులో ఉంచడం, మధ్యమధ్యలో విశ్రాంతి ఇవ్వడం వంటి చర్యలు తీసుకోవడం ద్వారా ఈ ప్రమాదాన్ని తగ్గించవచ్చు.
