అక్షరటుడే, ఇందూరు: Khammam Aesthetics Award | నవీపేట మండలంలోని (Navipet mandal) అభంగపట్నం గ్రామానికి చెందిన రచయిత అరుణ్ కుమార్ ఆలూరికి ప్రతిష్టాత్మక ‘ఖమ్మం ఈస్తటిక్స్ పురస్కారం’ (Khammam Aesthetics Award) వరించింది.
ఖమ్మం ఈస్తటిక్స్ సాహితీ సంస్థ నిర్వహించిన కథల పోటీలో అరుణ్‌కుమార్ ఆలూరి రాసిన ‘అంజమ్మ’ కథకు ద్వితీయ ఉత్తమ కథ పురస్కారం లభించింది. పురస్కార ప్రదానసభలో ఆయనకు రూ.15వేల వేల నగదు, జ్ఞాపిక, శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా మొదటి మూడు బహుమతులతో పాటు, సాధారణ ప్రచురణకు తీసుకున్న తొమ్మిది కథలను కలిపి ఆ సంస్థ సంకలనం వెలువరించింది.
Khammam Aesthetics Award | అరుణ్‌కుమార్ ఆలూరి ప్రస్థానమిది..
జిల్లాకు చెందిన రచయిత అరుణ్‌కుమార్ ఆలూరి (Arun Kumar Aluri) సినిమాల మీద మక్కువతో 2007 నుంచి పత్రికలకు కథలు రాయటం మొదలుపెట్టారు. ఇప్పటివరకు ఇరవైకి పైగా కథలు, మూడు పాటలు (ప్రైవేట్ ఆల్బమ్స్) (private albums), ఇరవై నానీలు రాశారు. వివిధ సంస్థలు నిర్వహించిన కథల పోటీల్లో బహుమతులు గెల్చుకున్నారు.
అమెరికన్ తెలుగు అసోసియేషన్ (American Telugu Association)(ఆటా), కణిక వేదిక, వాసా ఫౌండేషన్ – సాహితీ కిరణం, తెలుగు తల్లి కెనడా, విశాలాక్షి, నమస్తే తెలంగాణ-ముల్కనూరు సాహితీపీఠం (రెండుసార్లు) బహుమతులు గెలుచుకున్నారు. వీటిల్లోనే కాకుండా నవ్య, ప్రజాశక్తి, ఆంధ్రభూమి, తెలుగు వెలుగు, సారంగ, సంచిక, సహరి, ఈనాడు పత్రికల్లో వీరి కథలు ప్రచురితమయ్యాయి. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ నిర్మించిన ‘జంగుబాయి జాతర’ డాక్యుమెంటరీకి స్క్రిప్ట్‌ను అందించారు. నవసాహితీ ఇంటర్నేషనల్ (చెన్నై) ముళ్లపూడి ఉత్తమ హాస్య కథ పురస్కారం కూడా అందుకున్నారు.
Khammam Aesthetics Award | సినిమా రంగంలో రాణింపు..
అరుణ్‌కుమార్ ఆలూరి ఎస్సెస్సీని నవీపేటలో పూర్తిచేశారు. అనంతరం డిప్లొమా, ఇంజినీరింగ్‌ను (diploma and engineering) నిజామాబాద్‌లో పూర్తి చేసిన తర్వాత పలు సంస్థల్లో పనిచేసి చేస్తూ ప్రస్తుతం సినిమా రంగంలో రాణిస్తున్నారు. సుమ కనకాల నటించిన ‘జయమ్మ పంచాయితీ’ సినిమా ద్వారా స్క్రిప్ట్ డాక్టర్‌గా తెలుగు తెరకు పరిచయమయ్యారు. రెండో సినిమాకే గుల్షన్ దేవయ్య, సయ్యామీ ఖేర్ నటించిన ‘8 ఏఎం మెట్రో’ హిందీ సినిమాతో స్క్రిప్ట్ కన్సల్టెంట్‌గా బాలీవుడ్‌లో (Bollywood) అడుగుపెట్టారు.
చైతన్యరావ్, భూమిశెట్టి నటించిన ‘షరతులు వర్తిస్తాయి!’ సినిమాతో కో-రైటర్‌గా నిలదొక్కుకున్నారు. మరో రెండు సినిమాలు షూటింగ్, ప్రొడక్షన్ దశల్లో ఉన్నాయి. అలాగే ప్రముఖ ప్రచురణ సంస్థకు ఎడిటర్, ప్రూఫ్ రీడర్‌గా సేవలందిస్తున్నారు. ఈ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా వివిధ దేశాల్లోని తెలుగు రచయితలు పంపిన 140 పైచిలుకు కథల్లోంచి జిల్లా రచయితకు ద్వితీయ ఉత్తమ కథా పురస్కారం లభించడంపై పలువురు కవులు, రచయితలు, గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
