అక్షరటుడే, వెబ్‌డెస్క్: Telangana Police | పోలీస్ శాఖను ఆత్మహత్యలు (police department) కలవర పెడుతున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా ఇటీవల పలువురు ఖాకీలు ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి.
సాధారణంగా పోలీసులు ధైర్యంగా ఉంటారు. వారికి శిక్షణ కాలంలో మానసిక ఒత్తిడిని (mental stress) ఎలా తట్టుకోవాలో కూడా నేర్పుతారు. అయినా కూడా పలువురు అధికారులు, సిబ్బంది క్షణికావేశంలో ప్రాణాలు తీసుకుంటున్నారు. ఆత్మహత్యలు చేసుకొవద్దని అవగాహన కల్పించాల్సిన ఖాకీలే తనువు చాలిస్తుండడం ఆందోళన కలిగించే అంశం. కుటుంబ సమస్యలు (Family problems), ఆర్థిక ఇబ్బందులతో పలువురు బలవన్మరణానికి పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఉన్నతాధికారులు చర్యలు చేపట్టాలని పలువురు సూచిస్తున్నారు.
Telangana Police | ఇటీవల చోటుచేసుకున్న ఘటనలు
ఉప్పల్ మల్లికార్జుననగర్‌లో నివాసముంటున్న కానిస్టేబుల్ శ్రీకాంత్ (42) ఈ నెల 8న ఆత్మహత్య చేసుకున్నాడు. శ్రీకాంత్ ఫిలింనగర్ పోలీస్ స్టేషన్లో (Filmnagar Police Station) విధులు నిర్వహిస్తున్నాడు. 2009 బ్యాచ్‌కు చెందిన ఆయన అక్టోబర్ 23 నుంచి విధులకు హాజరు కావడం లేదు. శనివారం తన ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. నవంబర్ 3న సంగారెడ్డిలోని మహబూబ్ సాగర్ చెరువుకట్టపై కానిస్టేబుల్ సందీప్ ఆత్మహత్య చేసుకున్నారు. కల్హేర్‌కి చెందిన సందీప్ సంగారెడ్డి (Sangareddy) టూ టౌన్లో పని చేస్తున్నాడు. అయితే ఆయన ఆన్‌లైన్ బెట్టింగ్ గేమ్స్‌కు బానిసై ఆత్మహత్యకి పాల్పడినట్లు తెలుస్తోంది.
నవంబర్ 1న వరంగల్ జిల్లా (Warangal district) స్పెషల్ బ్రాంచ్ ఎస్సై హఫీజ్ ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ కలహాలతో ఆయన పురుగుల మందు తాగగా.. చికిత్స పొందుతూ మరణించాడు. కామారెడ్డి జిల్లాలో (Kamareddy district) అక్టోబర్ 27న ఏఆర్ కానిస్టేబుల్ పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
మద్దికుంట గ్రామానికి చెందిన రేకులపల్లి జీవన్ రెడ్డి (37) ఏఆర్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. కుటుంబ కలహాలతో భార్య పుట్టింటికి వెళ్లిపోగా.. ఆమె కాపురానికి రావడం లేదని బలవన్మరణానికి పాల్పడ్డాడు. సూర్యాపేటలో ఎస్బీ విభాగంలో ఏఎస్సైగా పని చేస్తున్న గోపగాని సత్యనారాయణ గౌడ్ అక్టోబర్ 11న ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆయన అనారోగ్య కారణాలతో సూసైడ్ చేసుకున్నట్లు సమాచారం.
Telangana Police | కౌన్సెలింగ్ అవసరం
పోలీసులకు విపరీతమైన పని ఒత్తిడి ఉంటుంది. బందోబస్తు, ట్రాఫిక్ విధులు, నేరాల దర్యాప్తు (crime investigation) విధులతో ఒత్తిడికి గురి అవుతుంటారు. ముఖ్యంగా కింది స్థాయి సిబ్బందిపై అదనపు భారం ఉంటుంది. ఈ క్రమంలో కుటుంబ, ఆర్థిక సమస్యలు తోడు కావడంతో కొందరు తనువు చాలిస్తున్నారు. మానసికంగా ధైర్యంగా ఉండాల్సిన పోలీసులు ఆత్మహత్యలకు పాల్పడకుండా అధికారులు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. పోలీసులకు అప్పుడప్పుడు కౌన్సెలింగ్ నిర్వహించాలి. అలాగే పని ఒత్తిడి తగ్గించే చర్యలు చేపట్టాలి.
