అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Starlink | ప్రపంచ కుబేరుడు, అమెరికా వ్యాపారవేత్త ఎలన్‌మస్క్(Elon Musk) తన స్టార్‌లింక్ ఇంటర్నెట్ సేవలను భారత్‌లో ప్రారంభించనున్న విషయం తెలిసిందే. టవర్లు, కేబుల్స్ అవసరం లేకుండా నేరుగా శాటిలైట్ నుంచి ఇంటర్నెట్ అందించడం దీని ప్రత్యేకత.
ప్రస్తుతం ప్రపంచంలోని పలు దేశాల్లో స్టార్‌లింక్ సేవలు(Starlink Services) అందుబాటులో ఉన్నాయి. భారత్‌లో త్వరలో కంపెనీ తన సేవలను ప్రారంభించనుంది. ఈ క్రమంలో వినియోగదారుల రిజిస్ట్రేషన్ సమయంలో ఇబ్బందులు లేకుండా ఉండేందుకు కంపెనీ చర్యలు చేపట్టింది. నేరుగా ఆన్లైన్లో అప్లై చేసుకుంటే ఇన్స్టాలేషన్ చేసి సేవలు అందించనుంది. వినియోగదారుల వెరిఫికేషన్ కోసం ఆధార్ ఐడెంటిఫికేషన్(Aadhaar Identification)ను కంపెనీ వినియోగించుకోనుంది.
Starlink | కుదిరిన ఒప్పందం
ఇప్పటికే దేశంలో చాలా వాటికి ఆధార్ తప్పనిసరి. దీంతో ఆధార్ అథెంటికేషన్‌తో స్టార్‌లింక్ సేవలు అందజేయాలని కంపెనీ నిర్ణయించింది. ఈ మేరకు ఇటీవల యూఐఏడీఐ(UIDAI)తో కీలక ఒప్పందం చేసుకుంది. దీంతో వినియోగదారులకు త్వరిత, సురక్షితమైన KYC పూర్తవుతుందని కంపెనీ ప్రకటించింది. కాగితపు పని లేకుండా హై-స్పీడ్ శాటిలైట్ ఇంటర్నెట్‌ను యాక్సెస్ చేయడానికి వీలు కల్పిస్తుందని చెప్పింది. ఆధార్ e-KYCని సమగ్రపరచడం ద్వారా, స్టార్‌లింక్ గృహాలు, వ్యాపార సంస్థలకు సులభంగా సేవలు అందిస్తుందని కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు.
Starlink | వేగవంతమైన సేవల కోసం..
స్టార్‌లింక్ సేవలను వినియోగదారులకు వేగవంతంగా అందించడానికి ఆధార్ ఇ–కేవైసీ చేపట్టనున్నారు. పేస్ రికగ్నేషన్, బయోమెట్రిక్ ఆధారంగా స్టార్‌లింక్ కేవైసీ పూర్తి చేస్తుంది. నిమిషాల్లోనే ఈ ప్రక్రియ పూర్తవుతుంది. ఈ విధానం దేశ డిజిటల్ మౌలిక సదుపాయాలు, ప్రపంచ ఉపగ్రహ సాంకేతికత మధ్య సినర్జీని ప్రదర్శిస్తుందని కంపెనీ తెలిపింది.
Starlink | త్వరలో ప్రారంభం
స్టార్‌లింక్ దేశంలో త్వరలో తన సేవలను ప్రారంభించనుంది. ఎలాంటి టవర్లు లేకుండా నేరుగా శాటిలైట్ నుంచి హైస్పీడ్ ఇంటర్నెట్(High Speed Internet) అందించడం దీని ప్రత్యేకత. ఇప్పటికే పక్కనున్న బంగ్లాదేశ్‌లో ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి. అక్కడ ప్రతి నెల సబ్‌స్క్రీప్షన్ చార్జీలు దాదాపు రూ.3 వేలుగా ఉన్నాయి. మన దగ్గర సుమారుగా అవే ధరలు ఉండే అవకాశం ఉంది.