అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Local Body Elections | రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలపై కాంగ్రెస్ (Congress) కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ పరంగా బీసీలకు 42శాతం రిజర్వేషన్లు (BC Reservations) ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయించింది. దీంతో బీసీ రిజర్వేషన్లపై ఉత్కంఠకు తెరపడింది. త్వరలో స్థానిక ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది.
కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ (PAC) శనివారం గాంధీ భవన్లో సమావేశం నిర్వహించింది. సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్‌గౌడ్, మంత్రులు హాజరయ్యారు. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. ఇందులో భాగంగా బీసీ రిజర్వేషన్ బిల్లు రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉండడంతో పార్టీ పరంగా 42శాతం రిజర్వేషన్ అమలు చేయాలని నిర్ణయించారు.
Local Body Elections | బిల్లులు పెండింగ్‌లో ఉండడంతో..
తాము అధికారంలోకి వస్తే విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్ ఇస్తామని కాంగ్రెస్ (Congress) ప్రకటించింది. ఈ మేరకు అధికారం చేపట్టిన తర్వాత కుల గణన (Caste Census) చేపట్టింది. బీసీ బిల్లులను అసెంబ్లీలో ఆమోదించి కేంద్రానికి పంపింది. అయితే వాటిపై కేంద్రం ఎటూ తేల్చకపోవడంతో ఆర్డినెన్స్ ద్వారా స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని భావించింది. ఈ మేరకు ఆర్డినెన్స్‌ను గవర్నర్ ఆమోదం కోసం పంపగా.. ఆయన కూడా పెండింగ్‌లో పెట్టారు. ఇప్పటికే రాష్ట్రపతి దగ్గర బీసీ రిజర్వేషన్ల బిల్లు పెండింగ్‌లో ఉండడంతో పార్టీ పరంగా రిజర్వేషన్లు అమలు చేసి స్థానిక ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్ నిర్ణయించింది.
Local Body Elections | త్వరలో ఎన్నికలు
రాష్ట్రంలో పంచాయతీ పాలకవర్గాల పదవీకాలం పూర్తయి ఏడాదిన్నర దాటిపోయింది. ఎంపీటీసీలు, జెడ్పీటీసీల టర్మ్ అయిపోయి కూడా ఏడాది దాటింది. అయినా స్థానిక ఎన్నికలు లేకపోవడంతో పంచాయతీల్లో పాలన అస్తవ్యస్తంగా మారింది. బీసీ రిజర్వేషన్ల అంశం ఎటూ తేలకపోవడంతో ఎన్నికల ప్రక్రియ ఆలస్యం అయింది. ఈ క్రమంలో సెప్టెంబర్ 30లోపు ఎన్నికలు నిర్వహించాలని గతంలో హైకోర్టు ఆదేశించింది. అయితే బీసీ రిజర్వేషన్ల బిల్లుపై కేంద్రం స్పందించకపోవడంతో పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయించింది. మొత్తం సీట్లలో 42శాతం బీసీలకు కేటాయించి ఆ పార్టీ ఎన్నికలకు వెళ్లనుంది. తమ పార్టీ నుంచి బీసీలకు 42 శాతం టికెట్లు ఇస్తే మిగతా పార్టీలు కూడా ఇస్తాయని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ నెల 25న జరిగే మంత్రివర్గ సమావేశంలో స్థానిక ఎన్నికలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రాష్ట్రంలో త్వరలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Local Body Elections | కార్పొరేషన్ పదవులు భర్తీ చేస్తాం
పీఏసీ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు ఇతర అంశాలపై సైతం నాయకులు చర్చించారు. కార్పొరేషన్ పదవుల (Corporation positions) కోసం పార్టీలోని ద్వితీయ శ్రేణి నాయకులు కొంతకాలంగా ఎదురు చూస్తున్నారు. మీటింగ్‌లో ఈ అంశంపై సైతం చర్చించారు. త్వరలో కార్పొరేషన్ ఛైర్మన్ పదవులను భర్తీ చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఇండి కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్‌రెడ్డిని ఎంపిక చేయడం పట్ల పీఏసీ హర్షం వ్యక్తం చేసింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపైనా సుదీర్ఘ చర్చ జరిగింది.