అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Shrusti Clinic | ఐవీఎఫ్ (IVF), సరోగసి (Surrogacy) పేరిట మోసాలకు పాల్పడిన సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ (Srishti Test Tube Center) కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. డాక్టర్ నమ్రత ఐవీఎఫ్ కోసం వచ్చిన జంటలను సరోగసి వైపు మళ్లించి రూ.లక్షలు దండుకున్న విషయం తెలిసిందే. సరోగసి చేయకుండానే.. పేదలు, పిల్లలను అమ్మే గ్యాంగుల నుంచి శిశువులను కొనుగోలు చేసి దంపతులకు అప్పగించిన నమ్రతను ఇదివరకే పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఇప్పటి వరకు 25 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
డాక్టర్ నమ్రత 8 రాష్ట్రాల్లో కార్యకలాపాలు సాగించినట్లు పోలీసులు గుర్తించారు. 80 మంది పిల్లలను విక్రయించి దంపతుల నుంచి రూ.25 కోట్లకు వరకు వసూలు చేసింది. ఈ డబ్బును విదేశాల్లో పెట్టుబడి పెట్టినట్లు సమాచారం. ఈ వ్యవహారంలో మనీ లాండరింగ్ (Money laundering) జరిగినట్లు ఈడీ (ED) అనుమానిస్తోంది. దీంతో కేసు వివరాలు ఇవ్వాలని ఈడీ అధికారులు హైదరాబాద్ పోలీసులకు లేఖ రాశారు.
Shrusti Clinic | సరోగసి పేరిట చైల్డ్ ట్రాఫికింగ్
డాక్టర్ నమ్రతకు హైదరాబాద్‌తో పాటు విజయవాడ, విశాఖపట్నంలో సెంటర్లు ఉన్నాయి. పిల్లలు లేని దంపతులు ఆమె దగ్గరకు ఐవీఎఫ్ కోసం వచ్చేవారు. అయితే సరోగసితో మంచి ఫలితాలు ఉంటాయని ఆమె తన దగ్గరకు వచ్చిన వారిని నమ్మించేది. అనంతరం సరోగసి కోసం రూ.30 నుంచి రూ.40 లక్షల వరకు వసూలు చేసింది. పిల్లలను కొనుగోలు చేసి దంపతులకు ఇచ్చేది. సరోగసి ద్వారా పుట్టినట్లు వారిని నమ్మించేది. పేద దంపతుల నుంచి డాక్టర్ నమ్రత ఏజెంట్ల సాయంతో శిశువులను కొనుగోలు చేసేది. అలాగే పిల్లలను అమ్మే గ్యాంగులతో కూడా ఆమెకు లింక్‌లు ఉన్నాయి.
