అక్షరటుడే, వెబ్‌డెస్క్: Kaleshwaram Commission | కాళేశ్వరం కమిషన్ విచారణలో కీలక మలుపు తీసుకుంది. బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన కాళేశ్వరంలో భారీగా అక్రమాలు జరిగాయని, నాసిరకం పనులతో మేడిగడ్డ(Medigadda) కుంగిందని కాంగ్రెస్ ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అధికారంలోకి రాగానే కాళేశ్వరంలో అక్రమాలను నిగ్గు తేల్చేందుకు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్(Justice PC Ghosh Commission)ను ఏర్పాటు చేసింది.
కాళేశ్వరం కమిషన్ ప్రాజెక్ట్ బ్యారేజీల నిర్మాణం, స్థలం మార్పుతో ఖర్చు వివరాలు సహా ఇతర కీలక అంశాలపై విచారణ చేపట్టింది. అప్పుడు విధులు నిర్వహించిన దాదాపు 200 మంది అధికారులను కమిషన్ విచారించింది. అంతేగాకుండా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్(Former CM KCR), మాజీ మంత్రులు హరీశ్‌రావు(Harish Rao), ఈటల రాజేందర్(Eatala Rajendhar)ను సైతం కమిషన్ విచారించింది. ఈ క్రమంలో కేబినెట్ ఆమోదంతోనే అన్ని పనులు చేశామని ఈటల, హరీశ్‌రావు కమిషన్‌కు తెలిపారు. దీంతో గత ప్రభుత్వ హయాంలో జరిగిన కేబినెట్ మీటింగ్‌ల మినిట్స్ ఇవ్వాలని కాళేశ్వరం కమిషన్ ప్రభుత్వాన్ని కోరింది.
Kaleshwaram Commission | కమిషన్ లేఖపై చర్చించిన సీఎం
కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు(Kaleshwaram Project) సంబంధించిన మంత్రివర్గ తీర్మానాల వివరాలు ఇవ్వాలని కమిషన్ ప్రభుత్వానికి లేఖ రాసింది. ఈ నెల 13న నీటిపారుదలశాఖకు కూడా లేఖ రాసింది. కమిషన్ లేఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సోమవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో చర్చించారు. కమిషన్‌కు అన్ని వివరాలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. దీంతో ఇప్పటి వరకు అధికారులు, ప్రజాప్రతినిధులు చెప్పిన వివరాలను కేబినెట్ మినిట్స్‌తో సరిపోల్చిన అనంతరం కమిషన్ ప్రభుత్వానికి తుది నివేదిక సమర్పించే అవకాశం ఉంది. ఈ నెలాఖరు వరకు ప్రభుత్వానికి కమిషన్ నివేదిక ఇవ్వనున్నట్లు సమాచారం.