అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Shristi Clinic | ఐవీఎఫ్ (IVF), సరోగసి (Surrogacy) పేరిట పలువురిని మోసం చేసిన సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ (Shristi Test Tube Center) డాక్టర్ నమ్రత రిమాండ్ రిపోర్టులో పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు.
సరోగసి పేరిట దంపతులకు నమ్రత ఇతరుల బిడ్డను అప్పగించిన విషయం తెలిసిందే. రాజస్థాన్‌కు (Rajasthan) చెందిన దంపతుల దగ్గర సరోగసి కోసం రూ.40 లక్షల వరకు తీసుకున్న నమ్రత.. పేద మహిళ దగ్గర బిడ్డను రూ.90 వేలుకు బిడ్డను కొనుగోలు చేసి అప్పగించింది. సరోగసి ద్వారా ఆ బిడ్డ పుట్టినట్లు చెప్పింది. అయితే నమ్రత మోసం చేసినట్లు తెలియడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. డాక్టర్ నమ్రతతో పాటు 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Shristi Clinic | ఐదు రోజుల కస్టడీ
డాక్టర్ నమ్రతను పోలీసులు కోర్టులో హాజరు పర్చగా రిమాండ్ విధించారు. తాజాగా పోలీసులు ఆమెను కస్టడీకి ఇవ్వాలని పిటిషన్ వేశారు. డాక్టర్ నమ్రత రిమాండ్ రిపోర్టులో వారు కీలక విషయాలు వెల్లడించారు. తాను అక్రమాలకు పాల్పడినట్టు నమ్రత ఒప్పుకున్నారు. సరోగసి పేరిట దంపతులను మోసం చేసినట్టు అంగీకరించిందని పోలీసులు పేర్కొన్నారు. ఆమెను ఐదు రోజుల పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతించింది. దీంతో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఎంతమంది దంపతులను మోసం చేశారనే విషయాలు తెలిసే ఛాన్స్ ఉంది.
Shristi Clinic | ఏఎన్ఎంల సాయంతో బిడ్డల కొనుగోలు
డాక్టర్ నమ్రతకు ఏపీలోని కొందరు ఏఎన్ఎంలు (ANM) సాయం చేసినట్లు పోలీసులు తెలిపారు. గిరిజన ప్రాంతాలు, పేద దంపతుల పిల్లలను వారి ద్వారా నమ్రత కొనుగోలు చేసేవారు. డబ్బులు ఆశచూపడంతో కొంతమంది ఏఎన్ఎంలు పిల్లలను తీసుకొచ్చి ఇచ్చేవారు. ఆ పిల్లలను సరోగసి ద్వారా పుట్టారని ఆమె దంపతులకు అప్పగించేది. గాంధీ ఆస్పత్రిలో (Gandhi Hospital) పనిచేసే డాక్టర్ సదానందం ఆమెకు సహకరించాడు. ఇప్పటికే పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు.
Shristi Clinic | ప్రశ్నిస్తే బెదిరింపులు
డాక్టర్ నమ్రత ఐవీఎఫ్ కోసం సెంటర్‌కు వచ్చే దంపతులను సరోగసి వైపు మళ్లించేది. పిల్లలను అప్పగించిన తర్వాత ఎవరైనా ప్రశ్నిస్తే నమ్రత బెదిరింపులకు పాల్పడేది. ఆమె కుమారుడు న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఆయన సైతం కేసులు వేస్తానని దంపతులను బెదిరించేవాడు. రాజస్థాన్‌కు చెందిన దంపతులను సైతం వీరు బెదిరించారు. అయితే వారు ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారి బండారం బయటపడింది.