CCS Meeting | మోదీ నేతృత్వంలో రేపు కీల‌క స‌మావేశం.. పాక్‌పై క‌ఠిన నిర్ణ‌యాలు తీసుకునే అవ‌కాశం
CCS Meeting | మోదీ నేతృత్వంలో రేపు కీల‌క స‌మావేశం.. పాక్‌పై క‌ఠిన నిర్ణ‌యాలు తీసుకునే అవ‌కాశం

అక్షరటుడే, వెబ్​డెస్క్​: CCS Meeting | పాకిస్తాన్‌తో ఉద్రిక్త‌త‌లు కొన‌సాగుతున్న నేప‌థ్యంలో ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) నేతృత్వంలో బుధ‌వారం కీల‌క స‌మావేశం జ‌రుగ‌నుంది. మోదీ అధ్య‌క్ష‌త‌న భ‌ద్ర‌తా వ్య‌వ‌హారాల క్యాబినెట్ క‌మిటీ (సీసీఎస్‌) భేటీ జ‌రుగ‌నుంది. ఈ స‌మావేశంలో ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకోనున్న‌ట్లు తెలిసింది. ప‌హ‌ల్గామ్ దాడి (Pahalgam Attack) అనంతర ప‌రిణామాలు, పాకిస్తాన్ ప్ర‌తీకార చ‌ర్య‌లతో పాటు ఇత‌ర కీల‌క అంశాల‌పై చ‌ర్చించ‌న‌ట్లు స‌మాచారం. వారం వ్య‌వ‌ధిలోనే భ‌ద్ర‌తా వ్య‌వ‌హారాల కేబినెట్ క‌మిటీ రెండోసారి భేటీ కానుంది.

CCS Meeting | ప్రాధాన్యం సంత‌రించుకున్న భేటీ..

ఉద‌యం 11 గంట‌ల‌కు మోదీ నివాసంలో జ‌రుగ‌నున్న ఈ స‌మావేశంలో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, హోం మంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌తో పాటు ఇత‌ర సీనియ‌ర్ ఉన్న‌తాధికారులు పాల్గొన‌నున్నారు. స‌రిహ‌ద్దుల్లో పాకిస్తాన్ (Pakistan) నిరంత‌రం కాల్పులు జ‌రుపుతుండ‌డం, ఆ దేశ మంత్రులు రెచ్చ‌గొట్టేలా ప్ర‌క‌ట‌న‌లు చేస్తున్న త‌రుణంలో సీసీఎస్ (CCS) భేటీ జ‌రుగుతుండ‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది.

ప‌హ‌ల్గామ్ దాడి త‌ర్వాత గ‌త బుధ‌వారం స‌మావేశ‌మైన భ‌ద్ర‌తా వ్య‌వ‌హారాల కేబినెట్ క‌మిటీ.. పాక్‌కు బుద్ధి చెప్పేలా ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంది. 1960 నాటి సింధు జలాల (Indus River) ఒప్పందాన్ని నిలిపివేత‌, సరిహద్దులు మూసివేత‌తో పాటు ఆ దేశ పౌరుల‌కు వీసాల జారీని నిలిపివేసింది. త‌క్ష‌ణ‌మే దేశం విడిచి వెళ్లాల‌ని పాక్ పౌరుల‌ను ఆదేశించింది. అలాగే, పాక్‌తో అన్ని ర‌కాల వాణిజ్యాన్ని తెంచుకోవ‌డంతో పాటు కొన్ని యూట్యూబ్ ఛానెళ్లు, X హ్యాండిల్లను బ్లాక్ చేసి ప‌డేసింది.

CCS Meeting | పాక్‌పై మ‌రిన్ని క‌ఠిన చ‌ర్య‌లు

ఇప్ప‌టికే దాయాదిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకున్న కేంద్రం.. సీసీఎస్ భేటీలోనూ కీల‌క నిర్ణ‌యాలు తీసుకునే అవ‌కాశ‌ముంది. పొరుగు దేశంతో పూర్తిగా సంబంధాలు తెంచుకోవ‌డంతో పాటు ఆ దేశానికి ఎగుమ‌తులు నిలిపి వేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది. అలాగే, పాక్ విమానాల (Pakistan planes) రాక‌పోక‌ల‌పై ఆంక్ష‌లు విధించ‌డంతో పాటు, ఇత‌ర సైనిక పరమైన నిర్ణ‌యాలు తీసుకోనున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. పాకిస్తాన్ ఆక్ర‌మిత కాశ్మీర్‌ను స్వాధీనం చేసుకునే అంశంతో పాటు పాక్‌పై యుద్ధం వంటి అంశాల‌పై చ‌ర్చించ‌నున్న‌ట్లు తెలుస్తోంది.