అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Maoists Surrender | మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. బస్తర్ ప్రాంతంలో ఆ పార్టీకి కీలకంగా వ్యవహరిస్తున్న బర్సా దేవా (Barsa Deva) లొంగిపోయారు.ఒకప్పుడు మావోయిస్టులకు కంచుకోటగా ఉన్న బస్తర్‌లో మావోయిజం కనుమరుగు అవుతోంది.
మోస్ట్ వాంటెండ్ కమాండర్, పీఎల్జీఏ బీఎన్-1 అధిపతి బర్సా దేవా (48) అలియాస్ బర్సా సుక్కా అలియాస్ దేవన్న లొంగిపోయి, జనజీవన స్రవంతిలో చేరినట్లు సమాచారం. సుక్మాలోని తీవ్రవాద ప్రభావిత గ్రామమైన పువర్తికి చెందిన ఇతనిపై రూ.కోటి వరకు రివార్డు ఉంది. భద్రతా బలగాలపై దాడులు, మెరుపుదాడికి సంబంధించిన పలు కేసుల్లో ఇతను నిందితుడు. దేవా 2000వ దశకం ప్రారంభంలో మావోయిస్టులలో చేరాడు. ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌లో మిగిలి ఉన్న చివరి కీలక మావోయిస్టు కమాండర్లలో ఒకరు.
Maoists Surrender | హైదరాబాద్‌లో సరెండర్
మావోయిస్ట్ కీలక నేత మాడ్వి హిడ్మా (Madvi Hidma) ఇటీవల ఎన్కౌంటర్లో మృతి చెందిన విషయం తెలిసిందే. హిడ్మాకు దేవా సన్నిహితుడు. ఇద్దరిది ఒకే గ్రామం. బార్సే దేవా, అతని సహచరులు హైదరాబాద్‌లో లొంగిపోనున్నట్లు సమాచారం. డీజీపీ శివధర్‌రెడ్డి (DGP Shivadhar Reddy) ఎదుట శుక్రవారం ఆయన సరెండర్ అయ్యారు. ఆయనతో పాటు మరో 15 మంది లొంగిపోయినట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలో అధికార ప్రకటన వచ్చే అవకాశం ఉంది. హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత, బార్సే దేవా పీఎల్జీఏ కమాండర్‌గా నియమితులయ్యారు. ఆయన లొంగుబాటు నక్సల్ వ్యతిరేక ప్రచారంలో భద్రతా దళాలకు పెద్ద విజయం. బస్తర్ ప్రాంతంలో చురుకుగా ఉన్న నక్సలైట్ నెట్‌వర్క్‌కు పెద్ద ఎదురుదెబ్బ అని పలువురు అభిప్రాయ పడుతున్నారు.
Maoists Surrender | మూడు జిల్లాల్లో ప్రభావం
మావోయిస్టులలో బెటాలియన్ నంబర్ 1 సంస్థ అత్యంత ప్రమాదకరమైనదిగా పరిగణిస్తారు. దానికి బార్సే దేవా కమాండర్‌గా ఉన్నారు. దంతెవాడ, బీజాపూర్ (Bijapur), సుక్మా జిల్లాల్లో ఈ బెటాలియన్ ప్రభావం బలంగా ఉంది. ఈ బృందంలో AK-47లు, INSAS, SLR, స్నిపర్ గన్స్ వంటి ఆయుధాలతో సాయుధులైన వందలాది మంది నక్సలైట్లు ఉన్నారు. ఈ బెటాలియన్ దాడుల్లో ఎంతో మంది జవాన్లు చనిపోయారు. ఈ క్రమంలో దేవా అనుచరులతో లొంగిపోవడంతో బెటాలియన్ బలహీనంగా మారే అవకాశం ఉంది.