అక్షరటుడే, వెబ్‌డెస్క్ : ACB Case | నీటి పారుదల శాఖ ఈఎన్సీగా (Irrigation ENC) పనిచేసి రిటైర్డ్ అయిన మురళీధర్రావు అక్రమాస్తుల కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో (Kaleshwaram Project) కీలకంగా వ్యవహరించిన మురళీధర్రావు (Muralidhar Rao) భారీగా అక్రమాస్తులు కూడబెట్టారు. ఈ మేరకు ఏసీబీ అధికారులు జులై 15 ఆయన ఇంటితో పాటు 11 ప్రాంతాల్లో దాడులు (ACB Raids) చేశారు. ఈ సందర్భంగా భారీగా అక్రమాస్తులను గుర్తించిన ఏసీబీ అధికారులు ఆయనను అరెస్ట్ చేశారు.
ACB Case | కొనసాగుతున్న కస్టడీ
ఏసీబీ అధికారులు రిటైర్డ్ ఈఎన్సీని కోర్టులో హాజరు పర్చగా జడ్జి రిమాండ్ విధించారు. అనంతరం వారు ఆయనను ఐదు రోజుల కస్టడీకి తీసుకున్నారు. శనివారం నాలుగో రోజు ఆయనను విచారిస్తున్నారు. విచారణ సందర్భంగా అధికారులు కీలక విషయాలు గుర్తించారు. భారీగా అక్రమాస్తులు సంపాదించిన మురళీధర్రావు వాటిని తన కొడుకు పేరిట రిజిస్ట్రేషన్ చేయించాడు. మురళీధర్రావు కుమారుడు సాయి అభిషేక్ ఆస్తులను అధికారులు గుర్తించారు. తెలంగాణ, ఏపీ, తమిళనాడులో ఆయన పేరిట భారీగా ఆస్తులు ఉన్నట్లు అధికారులు తేల్చారు.
ACB Case | పలు కంపెనీల్లో పెట్టుబడులు
మురళీధర్రావు కుమారుడు తమిళనాడు, ఏపీలోని పలు కంపెనీల్లో భారీగా పెట్టుబడులు పెట్టినట్లు తెలిసింది. ఆరు బ్యాంకు లాకర్లలో (Bank Lockers) మూడు లాకర్లకు ఏసీబీ అధికారులు ఇప్పటికే ఓపెన్ చేశారు. అందులో పలు కీలక డాక్యమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. తండ్రి, కొడుకుల ఆస్తులపై కలిపి ఏసీబీ అధికారులు ప్రశ్నించారు. అయితే ఏసీబీ అధికారులకు మురళీధర్ రావు సహకరించడం లేదని తెలుస్తోంది.
ACB Case | మాజీ ఈఎన్సీ ఆస్తులు
మురళీధర్‌రావుకు హైదరాబాద్ (Hyderabad) నగరంలోని కొండాపూర్‌లో ఒక విల్లా ఉంది. బంజరాహిల్స్, యూసుఫ్‌గూడ, బేగంపేట, కోకాపేట ప్రాంతాల్లో ఒక్కో ప్లాట్ ఉన్నాయి. కరీంనగర్, హైదరాబాద్ నగరాల్లో కమర్షియల్ భవనాలు ఉన్నాయి. కోదాడలో ఒక అపార్ట్మెంట్ ఉంది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో సోలార్ పవర్ ప్రాజెక్ట్ ఉండడం గమనార్హం. వరంగల్‌లో ఒక అపార్ట్మెంట్ నిర్మాణంలో ఉంది. 11 ఎకరాల వ్యవసాయ భూమి, హైదరాబాద్ నగరంలోని పలు కీలక ప్రాంతాల్లో నాలుగు ఓపెన్ ప్లాట్లు, మోకిలో 6500 చదరపు గజాల స్థలం ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. అంతేగాకుండా మూడు కార్లు, ఇందులో ఒకటి బెంజ్ కారు, భారీగా బంగారు ఆభరణాలు, బ్యాంకు డిపాజిట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.