అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Jogi Rames | ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన నకిలీ మద్యం (fake liquor scam case) కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేశ్‌ను (YSRCP leader Jogi Ramesh) ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఆదివారం ఉదయం అరెస్టు చేసింది. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఆయన ఇంటికి ఉదయమే చేరుకున్న సిట్ అధికారులు జోగి రమేశ్‌తో పాటు ఆయన అనుచరుడు ఆరేపల్లి రామును కూడా అరెస్టు చేశారు.
అనంతరం వారిద్దరిని విజయవాడలోని (Vijayawada) ఎక్సైజ్ ఆఫీస్‌కు తరలించి విచారిస్తున్నారు. కల్తీమద్యం కేసులో కీలక నిందితుడు జనార్దనరావు ఇచ్చిన స్టేట్‌మెంట్ ఆధారంగా రమేశ్‌ను అరెస్ట్ చేసినట్లు తెలిసింది. జోగి రమేశ్ ప్రోద్బలంతోనే నకిలీ మద్యం తయారు చేసినట్లు ఈ కేసులో ఏ-1గా ఉన్న జనార్ధన్‌రావు పోలీసులకు వాంగ్మూలమిచ్చారు. ఇందుకోసం రూ.3 కోట్లు ఇస్తానని జోగి రమేశ్ ఆఫర్ ఇచ్చారని, దీంతో ఆఫ్రికాలో డిస్టిలరీ ఏర్పాటు చేసుకోవాలని ఆశ పెట్టడంతో తాను ఇందులోకి దిగానని చెప్పారు. జనార్ధన్‌రావు (Janardhan Rao) వాంగ్మూలం నేపథ్యంలోనే జోగి రమేశ్‌తో పాటు ఆయన ప్రధాన అనుచరుడు ఆరేపల్లి రామును సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. వారిని విచారించిన అనంతరం కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.
Jogi Rames | అరెస్టు అక్రమమన్న జోగి..
తన అరెస్టుపై మాజీ మంత్రి జోగి రమేశ్ స్పందించారు. తనను అక్రమంగా అరెస్ట్ చేశారంటూ ఆరోపించారు. రాజకీయంగా కక్షగట్టి తనను ఇరికించారని విమర్శించారు. మరోవైపు, జోగి రమేశ్ అరెస్ట్ సమయంలో ఆయన ఇంటి దగ్గర వైసీపీ శ్రేణులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. వారిని పోలీసులు నియంత్రించగా, సిట్ జోగి రమేశ్‌ను విజయవాడకు తరలించారు. ఇబ్రహీంపట్నం (Ibrahimpatnam) కల్తీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ పాత్ర ఉన్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించుకున్నారు.
చిత్తూరు జిల్లాకు (Chittoor district) చెందిన జయచంద్రారెడ్డి సాయంతో నకిలీ మద్యం తయారీ చేయాలని జోగి రమేష్ చెప్పడంతోనే తాను నకిలీ మద్యం తయారు చేశానని జనార్దన్‌రావు సిట్ అధికారుల విచారణలో వెల్లడించాడు. ఆయన మంత్రిగా ఉన్న సమయంలోనే 2023లో నకిలీ మద్యం తయారు చేసినట్లు తెలిపాడు. తనకు ఆర్థికంగా సహాయం చేస్తానని హామీ ఇచ్చి, ఆ తర్వాత పట్టించుకోలేదని తెలిపాడు. ఈ మేరకు జనార్దన్‌రావు రాతపూర్వకంగానే స్టేట్‌మెంట్ ఇవ్వడంతో సిట్ అధికారులు జోగిని అరెస్టు చేశారు.
