అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Union Cabinet | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) అధ్యక్షతన మంగళవారం కేంద్ర కేబినెట్ సమావేశం అయింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నాలుగు రైల్వే ప్రాజెక్ట్‌లకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, ఛత్తీస్‌గఢ్‌లోని 18 జిల్లాలను కలిపే నాలుగు మల్టీ-ట్రాకింగ్ రైల్వే ప్రాజెక్టులను ఆమోదించింది. వీటి వ్యయం దాదాపు రూ.24,634 కోట్లు అవుతుందని అంచనా. సుమారు 894 కి.మీ. రైల్వే నెట్‌వర్క్‌ను ఈ ప్రాజెక్ట్‌లు పెంచనున్నాయి. ప్రజలు, వస్తువులు రవాణాలో ఇవి ఎంతగానో తోడ్పాటు అందిస్తాయని అధికారులు పేర్కొన్నారు.
Union Cabinet | ప్రాజెక్ట్‌ల వివరాలు..
మహారాష్ట్రలోని వార్ధా – భూసావాల్ మధ్య 314 కి.మీ. మేర మూడో, నాలుగో రైల్వే లైన్ నిర్మించనున్నారు. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌లోని గోండియా – డొంగార్గఢ్ మధ్య నాలుగో లైన్‌ను 84 కి.మీ, గుజరాత్, మధ్యప్రదేశ్‌లోని వడోదర – రాత్లాం మధ్య 3వ, 4వ లైన్ 259 కిలోమీటర్లు, మధ్యప్రదేశ్లోనిన ఇటార్సీ – భోపాల్ మధ్య 237 కిలోమీటర్ల నాలుగో లైన్ నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్ట్‌లతో సుమారు 3,633 గ్రామాలకు కనెక్టివిటీని పెంచుతుందని కేంద్రం తెలిపింది.
Union Cabinet | పీఎం గతిశక్తి కార్యక్రమంలో..
కేంద్ర కేబినెట్ నిర్ణయాలను రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ (Railway Minister Ashwini Vaishnav) మీడియాకు వెల్లడించారు. పెరిగిన లైన్ సామర్థ్యం చలనశీలతను గణనీయంగా పెంచుతుందని, ఫలితంగా భారతీయ రైల్వేలకు కార్యాచరణ సామర్థ్యం సేవా విశ్వసనీయత మెరుగుపడుతుందన్నారు. పీఎం గతిశక్తి (PM-Gati Shakti) కార్యక్రమంలో భాగంగా రూ.24,634 కోట్లతో నాలుగు రైల్వే ప్రాజెక్టులను ఆమోదించినట్లు వివరించారు. 2030-2031 నాటికి వీటిని పూర్తి చేస్తామని ఆయన తెలిపారు. మల్టీ ట్రాకింగ్‌తో రైళ్ల రద్దీ తగ్గుతుందని ఆయన చెప్పారు.
ఈ ప్రాజెక్టులు సాంచి, సాత్పురా టైగర్ రిజర్వ్, భీంబెట్కా రాక్ షెల్టర్, హజారా జలపాతం, నవేగావ్ నేషనల్ పార్క్ వంటి ప్రముఖ ప్రాంతాలకు రైల్వే కనెక్టివిటీని కల్పిస్తాయన్నారు. బొగ్గు, కంటైనర్లు, సిమెంట్, ఫ్లై యాష్, ఆహార ధాన్యం, ఉక్కు మొదలైన వస్తువుల రవాణాకు ఇవి ఎంతగానో దోహదపడుతాయన్నారు.