అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Ganesh Chaturthi | మరో మూడు రోజుల్లో వినాయక చవితి (Vinayaka Chaviti) పండుగ ఉంది. రాష్ట్రవ్యాప్తంగా వినాయక నవరాత్రులను ఘనంగా నిర్వహిస్తారు. వాడవాడలా గణనాథులను ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు చేస్తారు.
వినాయక చవితి బుధవారం కాగా.. ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేస్తున్నారు. గణేశ్ విగ్రహాలను ప్రతిష్ఠించడానికి నిర్వాహకులు మండపాలను సిద్ధం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం మండపాల నిర్వాహకులకు గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా గణేశ్ మండపాలకు, దుర్గామాత మండపాలకు ఉచిత విద్యుత్ (Free Current) ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Ganesh Chaturthi | అంగరంగ వైభవంగా..
రాష్ట్రంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతాయి. వీధివీధిన వినాయక మండపాలతో ఎక్కడా చూసినా ఆధ్యాత్మిక వాతావరణం కనిపిస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్ (Hyderabad) నగరంలో వినాయక చవితి ఘనంగా జరుపుతారు. ఈ క్రమంలో ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. భక్తులకు ఇబ్బందులు కల్గకుండా చర్యలు చేపట్టింది. నగరంలో వినాయక మండపాలకు ఉచిత విద్యుత్ ఇస్తామని ఇటీవల మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) ప్రకటించారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా ఉచిత విద్యుత్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Ganesh Chaturthi | నిమజ్జనం కోసం రూ.30 కోట్లు
హైదరాబాద్ మహా నగరంలో వినాయక నిమజ్జనం (Ganesha immersion) శోభాయామనంగా సాగుతోంది. వేలాది విగ్రహాలను నిమజ్జనం చేస్తారు. ఈ సందర్భంగా రోడ్లు భక్తజనంతో కిక్కిరిసిపోతాయి. దీంతో ప్రభుత్వం నగరంలో వినాయక నిమజ్జన ఏర్పాట్ల కోసం రూ.30 కోట్లు కేటాయించింది. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఎలాంటి ఘటనలు జరగకుండా అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నారు.