అక్షరటుడే, వెబ్డెస్క్ : Aarogyasri | రాష్ట్రంలో ఆరోగ్య శ్రీ సేవలపై (Aarogyasri Services ) ప్రైవేట్ ఆస్పత్రులు కీలక నిర్ణయం తీసుకున్నాయి. తమకు బకాయిలు పేరుకు పోవడంతో ఈ నెల 31 నుంచి సేవలు బంద్ చేయనున్నట్లు ప్రకటించాయి.
రాష్ట్రంలోని పేదలకు కార్పొరేట్ వైద్యం అందించడానికి ప్రభుత్వం ఆరోగ్య శ్రీ సేవలను ప్రారంభించిన విషయం తెలిసిందే. ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఆరోగ్య శ్రీ ద్వారా పలు చికిత్సలు ఉచితంగా చేయించుకోవచ్చు. అనంతరం ప్రభుత్వం ఆయా ఆస్పత్రులకు బకాయిలు విడుదల చేస్తుంది. ఆరోగ్య శ్రీ ద్వారా నిత్యం వేలాది మంది చికిత్స పొందుతున్నారు. కాంగ్రెస్ (Congress) అధికారంలోకి వచ్చాక ఆరోగ్య శ్రీ ద్వారా చికిత్స పొందే పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచింది. అయితే గత కొన్ని నెలలుగా తమకు బకాయిలు చెల్లించకపోవడంతో ఇబ్బందులు పడుతున్నట్లు ఆస్పత్రులు పేర్కొంటున్నాయి. దీంతో తప్పనిపరిస్థితుల్లో సేవలు నిలిపివేయాలని నిర్ణయించినట్లు తెలిపాయి.
Aarogyasri | రూ.14 వందల కోట్ల బకాయిలు
రాష్ట్రంలోని ఆరోగ్య శ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రులకు (Network Hospitals) సుమారుగా రూ.1300 కోట్ల నుంచి రూ.1400 కోట్ల బకాయిలు రావాల్సి ఉందని యాజమాన్యాలు తెలిపాయి. ఏడాది నుంచి బిల్లులు చెల్లించకపోవడంతో తీవ్రంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు పేర్కొన్నాయి. పలు ప్రైవేట్ నెట్‌వర్క్ ఆస్పత్రులు ఇప్పటికే దివాళా తీసే పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశాయి. ఆర్థిక భారాన్ని భరించలేక వైద్యులకు జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితి ఏర్పడిందని ఆస్పత్రులు తెలిపారు. దీంతో తమకు బకాయిలు చెల్లించకపోతే ఈ నెల 31న అర్ధరాత్రి నుంచి ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేస్తున్నట్లు ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ తెలిపింది.
Aarogyasri | ఆస్పత్రుల నిర్వహణకు ఇబ్బంది
ఆరోగ్య శ్రీతో పాటు, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ (EHS), జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ (JHS)కు సంబంధించిన బిల్లులు రాకపోవడంతో ఆస్పత్రుల నిర్వహణ కష్టంగా మారినట్లు నిర్వాహకులు పేర్కొంటున్నారు. పది రోజుల్లో బకాయిలు చెల్లించడంతో పాటు వైద్య సేవలకు నిర్ణయించిన ధరలను ప్రభుత్వం పున: సమీక్షించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఇప్పటికే తాము ఆరోగ్యశ్రీ ట్రస్ట్ (Aarogyasri Trust) సీఈవోకు నోటీసులు అందించామని నెట్‌వర్క్ ఆస్పత్రుల అసోషియేషన్ అధ్యక్షుడు వద్దిరాజు రాకేశ్ తెలిపారు.
Aarogyasri | 471 ఆస్పత్రుల్లో సేవలు
రాష్ట్రంలోని 471 ప్రైవేట్ ఆస్పత్రుల్లో (Private Hospitals) ఆరోగ్య శ్రీ సేవలు అందుతున్నాయి. ఆయా ఆస్పత్రులకు సుమారుగా రూ.1400 కోట్ల బకాయిలు రావాల్సి ఉన్నట్లు సమాచారం. జనవరిలో సైతం బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేయగా.. ప్రభుత్వం రూ.117 కోట్లు విడుదల చేసింది. ఆ సమయంలో మిగతా బకాయిలను వెంటవెంటనే చెల్లిస్తామని హామీ ఇచ్చింది. అయితే అప్పుడు ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంతో ఆస్పత్రులు మరోసారి సేవలు నిలిపివేస్తామని ప్రకటించాయి. దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.