అక్షరటుడే, వెబ్‌డెస్క్ : UPI Services | సాధారణ జీవితంలో భాగంగా మారిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) సేవల్లో శుక్రవారం నుంచి అనేక కీలకమైన మార్పులు అమలులోకి వచ్చాయి. బ్యాలెన్స్ చెకింగ్‌పై (Balance Checking) పరిమితి, ఆటో పే సేవలకు గడువు వంటివి ఇందులో ముఖ్యమైనవి.
తాజా మార్పులు వినియోగదారులు, వ్యాపారులు, బ్యాంకులను బాగా ప్రభావితం చేస్తాయి. UPIని పర్యవేక్షించే నియంత్రణ సంస్థ అయిన నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI), దేశవ్యాప్తంగా విస్తృతంగా ఉపయోగించే డిజిటల్ చెల్లింపు వ్యవస్థను మెరుగుపరచడం లక్ష్యంగా కొత్త మార్గదర్శకాలను ప్రవేశపెట్టింది. UPIని మరింత యూజర్ ఫ్రెండ్లీగా, విశ్వసనీయంగా, సజావుగా చేయడానికి ఈ కొత్త చర్యలు రూపొందించినట్లు ఎన్‌పీసీఐ వెల్లడించింది. ముఖ్యంగా లావాదేవీల పీక్ సమయంలో, అంతరాయాలను తగ్గించడం, మొత్తం సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి కొత్త మార్గదర్శకాలు అమలు చేసినట్లు తెలిపింది.
UPI Services | అంతరాయాలను నివారించేందుకు..
ది వాల్యూ ఆఫ్ ఇంటర్‌ఆపరబిలిటీ అనే అంతర్జాతీయ ద్రవ్య నిధి (International Monetary Fund) ఇటీవలి నోట్ ప్రకారం.. భారతదేశ UPI రియల్-టైమ్ పేమెంట్ టెక్నాలజీ విభాగంలో ప్రపంచ అగ్రగామిగా ఉద్భవించింది. ప్రపంచంలోని ఇతర చెల్లింపు వ్యవస్థలలో దాని ఆధిపత్యాన్ని ప్రతిబింబించే వీసాను UPI అధిగమించింది. భారతదేశంలోని డిజిటల్ చెల్లింపుల్లో దాదాపు 85 శాతం UPI ద్వారానే జరుగుతుందని, ప్రపంచ చెల్లింపుల్లో దాదాపు 60 శాతం UPI ద్వారానే జరుగుతుందని IMF పేర్కొంది. అయితే, ఇటీవల యూపీఐ సేవల్లో తరచూ అంతరాయాలు ఏర్పడ్డాయి. ఏప్రిల్ 12, మార్చి 26న UPI సేవలు నిలిచి పోవడంతో తాజా మార్గదర్శకాలను తీసుకొచ్చారు. ముఖ్యంగా, కోట్లాది రూపాయల విలువైన లావాదేవీలకు ఇవి ఆటంకం కలిగించడంతో ఈ అంతరాయాలు కోట్లాది మంది వినియోగదారులను ప్రభావితం చేశాయి.
UPI Services | బ్యాలెన్స్ చెకింగ్‌పై పరిమితి..
బ్యాంకు ఖాతాల్లో నగదు నిల్వలను చెక్ చేసుకోవడం ఇకప్పుడు చాలా ఇబ్బందిగా ఉండేది. గూగుల్ పే(Google Pay), ఫోన్ పే(Phone Pay) వంటివి అందుబాటులోకి వచ్చిన తర్వాత చాలా సులువై పోయింది. క్షణాల్లో ఖాతాలో నగదు నిల్వలను తెలుసుకునే అవకాశం ఏర్పడింది. అయితే, ఇన్నాళ్లూ బ్యాలెన్స్ చెకింగ్‌పై పరిమితులు లేవు. రోజుకు ఎన్నిసార్లయినా ఖాతాల్లో నిల్వలను సరిచూసుకునే అవకాశముండేది. అయితే, దీనిపై ఎన్‌పీసీఐ తాజాగా పరిమితి విధించింది. UPI వినియోగదారులు తమ ఖాతా బ్యాలెన్స్‌ను రోజుకు గరిష్టంగా 50 సార్లు తనిఖీ చేయడానికి మాత్రమే అవకాశమిచ్చింది. తద్వారా వినియోగదారులకు మెరుగైన సేవలు అందించే వెసులుబాటు కలుగుతందని పేర్కొంది.
UPI Services | ఆటో పే..
కొందరు వినియోగదారులు తమ బిల్లుల చెల్లింపులను ఆటో పే (Auto Pay) విధానంలో చెల్లిస్తారు. ఈఎంఐలు, కరెంట్ బిల్లులు, ఇతరత్రా బిల్లులు చెల్లించడానికి ఆటో పే సెట్ చేసుకుంటారు. నిర్దేశిత సమయం కాగానే ఆటోమెటిక్‌గా ఖాతా నుంచి చెల్లింపులు పూర్తయ్యేవి. అయితే, ఇందులోనూ కొత్త మార్పులు తీసుకొచ్చారు. సబ్‌స్క్రిప్షన్లు, యూటిలిటీ బిల్లులు, ఈఎంఐ(EMI)లు రద్దీ లేని సమయాల్లోనే నిర్వహించాలి. ఆటో పేమెంట్ రిక్వెస్ట్ పెట్టే సంస్థలు రద్దీ లేని సమయాల్లోనే యూపీఐ కలెక్షన్ రిక్వెస్ట్ షెడ్యూల్ చేయాల్సి ఉంటుంది. అయితే, యూజర్లు చేసే చిల్లింపులకు ఈ నిబంధన వర్తించదు. ఈ మార్పులు కస్టమర్లను నేరుగా ప్రభావితం చేయవు ఎందుకంటే వారి ఆటో-చెల్లింపులు యథావిధిగా ప్రాసెస్ చేయబడుతూనే ఉంటాయి.