అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Srivani Darshan Tickets | టీటీడీ అధికారులు (TTD Officers) కీలక నిర్ణయం తీసుకున్నారు. శ్రీవాణి దర్శన టికెట్ల జారీ విధానంలో మార్పులు చేశారు. అఫ్లైన్లో టికెట్ల విడుదలను నిలిపివేశారు.
తిరుమల (Tirumala)లో కొలువైన శ్రీవారిని నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు. భక్తుల సౌకర్యార్థం టీటీడీ పలు రకాల దర్శన సౌకర్యాలను కల్పిస్తోంది. అందులో శ్రీవాణి దర్శన కోటా కూడా ఉంది. శ్రీవాణి ట్రస్ట్ (Srivani Trust)కు రూ.10 వేల కంటే అదనంగా విరాళం ఇచ్చిన వారికి ఈ టికెట్లు కేటాయిస్తారు. అయితే వీటిని గతంలో ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్‌లైన్‌లో కూడా జారీ చేసేవారు. తాజాగా అధికారులు ఆఫ్‌లైన్ జారీ విధానాన్ని నిలిపివేశారు. ఆఫ్‌లైన్‌లో జారీ చేసే టికెట్లను ఇక నుంచి ఆన్లైన్ కరెంట్ బుకింగ్ విధానంలోకి మార్చారు.
Srivani Darshan Tickets | నిత్యం 800 టికెట్లు
కౌంటర్ల ద్వారా ప్రస్తుతం ఆఫ్‌లైన్‌లో నిత్యం 800 టికెట్లు ఇస్తున్నారు. ఇక నుంచి వీటిని కరెంట్ బుకింగ్ విధానం ద్వారా భక్తులకు అందించనున్నారు. ఈ మార్పులు శుక్రవారం (జనవరి 9) నుంచి అమలులోకి వస్తాయి. ఈ టికెట్లను ప్రతి రోజూ ఉదయం 9 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు. టికెట్ పొందిన వారు అదే రోజు సాయంత్రం 4 గంటలకు దర్శనం కోసం రిపోర్టు చేయాలి. ఒక్క కుటుంబంలో నలుగురికి మాత్రమే అనుమతి ఉంటుంది. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ విధానంలో టికెట్లు అందజేయనున్నారు. తిరుపతి ఎయిర్‌పోర్టు (Tirupati Airport)లో ప్రతిరోజూ ఆఫ్‌లైన్ విధానంలో 200 టికెట్లు జారీ చేస్తున్నారు. ఈ విధానం యథావిధిగా కొనసాగనుంది.