Jake Fraser McGurk
IPL 2025 | ఢిల్లీ క్యాపిటల్స్‌లో కీలక మార్పు!

అక్షరటుడే, వెబ్​డెస్క్ : IPL 2025 | ఐపీఎల్ 2025 సీజన్ రీస్టార్ట్‌కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) జట్టులో కీలక మార్పు చోటు చేసుకుంది. భారత్ తిరిగి రావడానికి జేక్ ఫ్రెజర్ మెక్‌గర్క్(Jake Fraser McGurk) సుముఖంగా లేకపోవడంతో అతని స్థానాన్ని బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్‌(Mustafizur Rahman)తో ఢిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. ఈ మేరకు ఐపీఎల్ నిర్వాహకులు బుధవారం ఓ ప్రకటనను విడుదల చేశారు. వ్యక్తిగత కారణాలతో లీగ్‌కు దూరంగా ఉండాలని భావించిన జేక్ ఫ్రెజర్ మెక్‌గర్క్ స్థానంలో ముస్తాఫిజుర్ రెహ్మాన్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ ఎంచుకుందని పేర్కొన్నారు.

రూ. 6 కోట్లకు ముస్తాఫిజుర్‌ను ఢిల్లీ క్యాపిటల్స్‌ తీసుకుంది. అయితే ఓపెనర్ స్థానంలో పేసర్‌(Pacer)ను ఎంచుకోవడంపై అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ సీజన్‌లో జేక్ ఫ్రెజర్-మెక్‌గర్క్ తీవ్రంగా నిరాశపరిచాడు. 6 మ్యాచ్‌ల్లో 9.17 సగటుతో 55 పరుగులే చేశాడు. తుది జట్టులో చోటు కూడా కోల్పోయాడు. గత సీజన్‌లో 234.04 స్ట్రైక్‌రేట్‌తో 330 పరుగులు చేసిన అతన్నిఆర్‌టీఎం(RTM) ద్వారా ఢిల్లీ కొనుగోలు చేసింది. కానీ జేక్ ఫ్రెజర్ జట్టు అంచనాలను అందుకోలేకపోయాడు.

మరోవైపు మెగా వేలంలో ముస్తాఫిజుర్ రెహ్మాన్ అన్‌సోల్డ్‌గా నిలిచాడు. చివరకు జేక్ ఫ్రెజర్(Jake Fraser) రూపంలో అతనికి అదృష్టం కలిసి వచ్చింది. ముస్తాఫిజుర్ రెహ్మాన్ ఇప్పటి వరకు 57 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడి 61 వికెట్లు పడగొట్టాడు. అతను ఇప్పటి వరకు ఏడు సీజన్లు ఆడి సీఎస్‌కే, రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహించాడు. కీలక ప్లే ఆఫ్స్ ముంగిట బలహీనంగా మారిన బౌలింగ్ విభాగాన్ని బలోపేతం చేసేందుకు ఢిల్లీ క్యాపిటల్స్.. ముస్తాఫిజుర్‌ను తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ పాయింట్స్ టేబుల్‌లో 11 మ్యాచ్‌ల్లో 6 విజయాలతో ఐదో స్థానంలో కొనసాగుతోంది. ప్లే ఆఫ్స్ చేరాలంటే ఢిల్లీ చివరి 3 మ్యాచ్‌ల్లో రెండు గెలవాలి.