అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Local Body Elections | తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు గతంలో ఉన్న ఇద్దరు పిల్లల నిబంధనను ఎత్తివేసింది.
సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) అధ్యక్షతన గురువారం మంత్రివర్గ సమావేశం (Cabinet Meeting) నిర్వహించారు. ఈ సమావేశంలో కీలక అంశాలపై చర్చించారు. బీసీ రిజర్వేషన్లపై కోర్టుల తీర్పు, స్థానిక ఎన్నికలపై మంత్రివర్గంలో చర్చించారు. ఈ క్రమంలో ఇద్దరు పిల్లల కంటే ఎక్కువగా ఉంటే స్థానిక ఎన్నికల్లో పోటీకి అనర్హులనే నిబంధనను తొలగించడానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ మేరకు పంచాయతీ రాజ్ చట్టం 2018లోని సెక్షన్ 21(3) తొలగింపునకు కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
Local Body Elections | జనాభా నియంత్రణ కోసం..
రాష్ట్రంలో జనాభా నియంత్రణ కోసం గతంలో ప్రభుత్వం ఇద్దరు పిల్లల నిబంధన అమలు చేసింది. ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటే స్థానిక ఎన్నికల్లో పోటీకి అర్హులు కాదు. అయితే ఇటీవల ప్రభుత్వాలు పిల్లలను ఎక్కువగా కనాలని ప్రోత్సహిస్తున్నాయి. జననాల రేటు తగ్గడంతో ఎక్కువ మందిని కనాలని ప్రజాప్రతినిధులు చెబుతున్నారు. ఈ క్రమంలో ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తి వేయాలని కొంతకాలంగా చర్చ సాగుతోంది. ఇటీవల మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి (Ponguleti Srinivas Reddy) మాట్లాడుతూ.. ఆ నిబంధన ఎత్తేస్తామని ప్రకటించారు. తాజాగా దాని తొలగింపునకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
Local Body Elections | నాయకుల హర్షం
గ్రామాల్లో చాలా మంది నాయకులకు ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నారు. అయితే గతంలో ఉన్న నిబంధనతో వారు స్థానిక ఎన్నికల్లో ఇన్ని రోజులు పోటీ చేయలేకపోయారు. తాజాగా ప్రభుత్వం ఎంత మంది పిల్లలు ఉన్నా.. పోటీకి అర్హులేనని ప్రకటించడంతో వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికల్లో పోటీకి సిద్ధం అవుతున్నారు. కాగా జీహెచ్ఎంసీ పరిధిలో ఈ నిబంధనను గతంలోనే తొలగించారు. తాజాగా మిగతా ఎన్నికల్లో సైతం తొలగించాలని కేబినెట్ నిర్ణయించింది.
