HomeUncategorizedPahalgam terror attack | ప‌హల్​గామ్​ ఉగ్ర‌దాడి కేసులో ముంద‌డుగు.. ఇద్ద‌రు కీల‌క వ్య‌క్తుల‌ను అరెస్టు...

Pahalgam terror attack | ప‌హల్​గామ్​ ఉగ్ర‌దాడి కేసులో ముంద‌డుగు.. ఇద్ద‌రు కీల‌క వ్య‌క్తుల‌ను అరెస్టు చేసిన ఎన్ఐఏ

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Pahalgam terror attack | పహల్​గామ్​ ఉగ్రవాద దాడి కేసులో జాతీయ ద‌ర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ముందడుగు వేసింది. ఇద్ద‌రు కీల‌క నిందితుల‌ను అరెస్టు చేసింది. పహల్​గామ్‌(Pahalgam)లోని బాట్‌కోట్‌కు చెందిన పర్వైజ్ అహ్మద్ జోథర్, పహల్​గామ్‌లోని హిల్ పార్క్‌కు చెందిన బషీర్ అహ్మద్ జోథర్ ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించినట్లు గుర్తించిన జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తోంది. విచార‌ణ‌లో వారు కీల‌క విష‌యాలు వెల్ల‌డించిన‌ట్లు తెలిసింది. దాడికి పాల్ప‌డిన వారిలో ముగ్గురు ఉగ్ర‌వాదుల‌కు సంబంధించిన సమాచారాన్ని వెల్ల‌డించిన‌ట్లు ఎన్​ఐఏ తెలిపింది. నిషేధిత ఉగ్ర‌సంస్థ ల‌ష్కరే తోయిబా (ఎల్ఈటీ)కి అనుబంధంగా ప‌ని చేస్తున్న పాకిస్తాన్ పౌరులుగా గుర్తించిన‌ట్లు పేర్కొంది.

“దాడికి ముందు పర్వైజ్, బషీర్ ముగ్గురు సాయుధ ఉగ్రవాదులకు హిల్ పార్క్‌లోని సీజనల్ ధోక్ (గుడిసె)లో ఆశ్రయం కల్పించారని NIA దర్యాప్తులో తేలింది. ఇద్దరు వ్యక్తులు ఉగ్రవాదులకు ఆహారం, ఆశ్రయం, లాజిస్టికల్ మద్దతు అందించారు. వారు (ఉగ్ర‌వాదులు) ఆ రోజు మధ్యాహ్నం పర్యాటకులను వారి మతపరమైన గుర్తింపు ఆధారంగా ఎంపిక చేసి చంపారు. ఇది ఇప్పటివరకు జరిగిన అత్యంత భయంకరమైన ఉగ్రవాద దాడులలో ఒకటిగా మారింది” అని NIA ఒక ప్రకటనలో తెలిపింది. చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం, 1967లోని సెక్షన్ 19 కింద ఇద్దరినీ అరెస్టు చేసిన ఎన్ఐఏ (NIA) కేసును మ‌రింత లోతుగా ద‌ర్యాప్తు చేస్తోంది.

దక్షిణ కశ్మీర్‌లోని ప్రసిద్ధ పర్యాటక గమ్యస్థానమైన పహల్​గామ్‌(Pahalgam)లో ఏప్రిల్‌ 22న రెచ్చిపోయిన ఉగ్ర‌వాదులు 26 మంది హిందు ప‌ర్యాట‌కుల‌ను కాల్చి చంపారు. మ‌త‌ప‌ర‌మైన ఈ దాడిపై దేశ‌వ్యాప్తంగా తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్త‌మైన నేప‌థ్యంలో ఇండియా ఆప‌రేష‌న్ సిందూర్‌(Operation Sindoor)ను ప్రారంభించింది. ఉగ్రవాదాన్ని ఎగ‌దోస్తున్న పాకిస్తాన్‌పై వైమానిక దాడులు చేప‌ట్టింది. పాక్‌తో పాటు పాకిస్తాన్ ఆక్ర‌మిత కశ్మీర్‌(Pakistan Occupied Kashmir)లోని ఉగ్ర‌వాద సంస్థ‌ల‌పైనా దాడులు చేసింది. దాయాది దేశం ప్ర‌తీకార దాడుల‌కు దిగడంతో ఆ దేశ సైనిక మౌలిక వ‌స‌తుల‌పై ప్రెసిష‌న్ స్ట్రైక్స్ చేసింది. కీల‌క వైమానిక స్థావరాల‌పై భార‌త్ విరుచుకు ప‌డ‌డంతో పాకిస్తాన్ కాళ్ల‌బేరానికి వ‌చ్చింది. కాల్పుల విర‌మ‌ణ‌కు సిద్ధ‌మ‌ని ప్ర‌క‌టించ‌డంతో భార‌త్ శాంతించింది.