అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Kerala Government | పర్యావరణ పరిరక్షణలో భాగంగా కేరళ ప్రభుత్వం మరో కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ఖాళీ ప్లాస్టిక్ మద్యం సీసా(Empty Plastic Liquor Bottle)లను తిరిగి ఇచ్చిన వారికి రూ. 20 వాపసు ఇచ్చే ప్రత్యేక పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం(State Government) నేటి నుంచి అమలు చేయనుంది.
రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని కేరళ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (Beverages Corporation Limited) ఈ వ్యర్థాల నిర్మూలన కార్యక్రమాన్ని పర్యవేక్షించనుంది.ఈ పథకం బుధవారం నుంచి పైలట్ ప్రాజెక్టుగా మొదలవుతోంది. మొదటి దశలో తిరువనంతపురం, కన్నూర్ జిల్లాల్లోని 20 అవుట్‌లెట్లలో దీనిని అమలు చేస్తారు. విజయవంతమైతే దాన్ని రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలకు విస్తరించాలని అధికారులు భావిస్తున్నారు.
Kerala Government | ఎలా పనిచేస్తుంది?
వినియోగదారులు మద్యం కొనుగోలు చేసే సమయంలో రూ. 20 అదనంగా డిపాజిట్ చెల్లించాలి. ఆ సీసాపై ప్రత్యేక QR కోడ్‌తో కూడిన ట్యాంపర్ ప్రూఫ్ లేబుల్ ఉంటుంది. వినియోగదారులు మద్యం సేవించిన తర్వాత, సీసాను చెక్కుచెదరకుండా అదే దుకాణానికి తిరిగి ఇవ్వాలి. సీసా తిరిగి ఇచ్చిన వెంటనే రూ. 20 డిపాజిట్ వినియోగదారుకు వెనక్కి చెల్లిస్తారు. సుస్థిరమైన రిటైల్ విధానాలను ప్రోత్సహించడంలో ఇది ఒక ముఖ్యమైన ముందడుగు. సీసాపై లేబుల్‌తో పాటు దుకాణం పేరు కూడా ఉంటుంది. రద్దీని నివారించేందుకు వినియోగదారులు కొనుగోలు చేసిన దుకాణానికే సీసాను తిరిగి ఇవ్వాలి అని బెవ్‌కో మేనేజింగ్ డైరెక్టర్ హర్షిత అత్తలూరి తెలిపారు.
ఈ లేబుల్ వ్యవస్థ, అవసరమైన సాఫ్ట్‌వేర్‌ను సి-డిట్ సహకారంతో అభివృద్ధి చేశారు. సీసాను తిరిగి ఇచ్చేటప్పుడు ప్రత్యేక రసీదు అవసరం లేదని, లేబుల్‌తో కూడిన సీసా ఉంటే సరిపోతుందని అధికారులు తెలిపారు. ఈ పథకం అమలు కోసం అవుట్‌లెట్లలో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. కుటుంబశ్రీ సభ్యులు ఈ కౌంటర్లను నిర్వహిస్తారు. వారు వినియోగదారుల నుంచి సీసాలను సేకరించి, వాటి లేబుళ్లను తొలగించి, నిర్దేశిత డబ్బాల్లో వేస్తారు. సేకరించిన సీసాలను రీసైక్లింగ్ కోసం క్లీన్ కేరళ కంపెనీ(Kerala Company) తో బెవ్‌కో ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకుంది. ప్లాస్టిక్ వ్యర్థాల సమస్య తీవ్రంగా పెరుగుతున్న తరుణంలో, ఈ పథకం కేరళలో పర్యావరణ పరిరక్షణకు మార్గదర్శకంగా నిలిచే అవకాశం ఉంది.