అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Kerala Renaming | కేంద్ర మంత్రివర్గం (Union Cabinet) కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) అధ్యక్షతన సేవా తీర్థ్‌లో మంగళవారం కేబినెట్ మీటింగ్ నిర్వహించారు.
మంత్రివర్గ భేటీ అనంతరం రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ (Ashwini Vaishnav) మీడియాకు వివరాలు వెల్లడించారు. కేరళ పేరును కేరళమ్‌గా మార్చడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. భాషా పునర్వ్యవస్థీకరణ నుంచి చాలా కాలంగా ఈ డిమాండ్ పెండింగ్‌లో ఉంది. ఈ రాష్ట్రాన్ని మలయాళంలో కేరళం అని పిలుస్తారు.
Kerala Renaming | రైల్వే పనులకు నిధులు
కేంద్ర మంత్రివర్గం రైల్వే పనులకు భారీగా నిధులు కేటాయించింది. గోండియా-జబల్పూర్ (Gondia-Jabalpur) రైలు మార్గాన్ని డబ్లింగ్ చేయడానికి రూ.5,236 కోట్లు, పునార్ఖ్-కియుల్ 3వ & 4వ రైలు మార్గాలకు రూ.2,668 కోట్లు, గమ్హారియా-చండిల్ 3వ & 4వ రైలు మార్గాలకు రూ.1,168 కోట్లు మంజూరు చేసింది. అలాగే శ్రీనగర్‌లో ఇంటిగ్రేటెడ్ ఎయిర్‌పోర్ట్ టెర్మినల్‌కు రూ.1,667 కోట్లు, అహ్మదాబాద్ మెట్రో (Ahmedabad Metro) ఫేజ్ 2బి పొడిగింపునకు రూ.1,067 కోట్లు ప్రతిపాదించింది. ముడి జనుము మద్దతు ధరను రూ.430గా నిర్ణయించింది. ఇంధన రంగంలో సంస్కరణలు చేపట్టాలని నిర్ణయం తీసుకుంది.
Kerala Renaming | ఎన్నికలకు ముందు..
కేరళ పేరును కేరళమ్‌గా మార్చాలని 2024 జూన్‌లో అసెంబ్లీ తీర్మానం చేసింది. ఈ మేరకు తాజాగా కేబినెట్ దానికి ఆమోదం తెలిపింది. ఏప్రిల్-మే నెలల్లో జరగనున్న కేరళ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో పేరు మారుస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
కేంద్ర మంత్రివర్గం ఆమోదం పొందిన తర్వాత, భారత రాష్ట్రపతి భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 నిబంధన ప్రకారం తన అభిప్రాయాలను వ్యక్తీకరించడానికి కేరళ (పేరు మార్పు) బిల్లు, 2026 అనే బిల్లును కేరళ రాష్ట్ర శాసనసభకు పంపిస్తారు. అనంతరం ఆ బిల్లును పార్లమెంట్ ఆమోదిస్తే.. పేరు మార్పు అమలులోకి వస్తుంది.
