అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Brain Eating Virus | దేశంలో మరోసారి అత్యంత ప్రమాదకర వైరస్ కలకలం సృష్టిస్తోంది. మెదడును నాశనం చేసే ప్రమాదకరమైన ‘బ్రెయిన్ ఈటింగ్ అమీబా’ (Brain-Eating Amoeba) మరోసారి కేరళ రాష్ట్రాన్ని భయబ్రాంతులకు గురిచేస్తోంది.
తాజాగా తిరువనంతపురంలోని అక్కులం టూరిస్ట్ విలేజ్ పూల్‌లో ఈత కొట్టిన 17 ఏళ్ల బాలుడికి ఈ వైరస్ సోకినట్లు పరీక్షల్లో తేలింది.అధికారులు అందించిన వివరాల ప్రకారం, బాలుడు ఇటీవల టూరిస్ట్ విలేజ్‌లోని స్విమ్మింగ్ పూల్‌లో ఈత కొట్టిన తర్వాత తీవ్రమైన తలనొప్పి, జ్వరం, వాంతులు వంటి లక్షణాలతో ఆసుపత్రిలో చేరాడు. అనంతరం నిర్వహించిన పరీక్షల్లో “నెగ్లేరియా ఫోలేరి” (Naegleria Fowleri) అనే అమీబా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం బాలుడి ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు సమాచారం.
Brain Eating Virus | వణికిస్తున్న వైరస్..
కేరళ(Kerala)లో ఇప్పటివరకు 67 కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్ వల్ల 18 మంది మరణించారు. ఈ వైరస్ అత్యంత ప్రమాదకరమైనదిగా వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ సూక్ష్మజీవి వెచ్చని, నిలకడగా ఉన్న మంచినీటిలో నివసిస్తుంది. ముఖ్యంగా చెరువులు, కాలువలు, సరస్సులు, పాత స్విమ్మింగ్ పూల్స్(Swimming Pools) లాంటి వాటిలో ఎక్కువగా ఉంటుంది. కలుషిత నీటిలో స్నానం చేసినప్పుడు ఈ అమీబా ముక్కు ద్వారా శరీరంలోకి ప్రవేశించి, నేరుగా మెదడుకు చేరుతుంది. అక్కడ తీవ్రమైన ఇన్‌ఫెక్షన్ ను కలిగిస్తూ మెదడు కణాలను నాశనం చేస్తుంది. ఈ వ్యాధికి సంబంధించి కొన్ని రోజులలోనే లక్షణాలు కనిపిస్తాయి. తీవ్రమైన తలనొప్పి, జ్వరం, వాంతులు, మెడ నొప్పి, మూర్ఛ, కోమాలోకి వెళ్లడం, చివరికి మృతి చెందే ప్రమాదం ఉంటుంది.
ఈ వ్యాధికి ప్రామాణిక చికిత్స ఇప్పటివరకు లేదు. చికిత్స తీసుకున్న వారిలో కేవలం 3% మాత్రమే జీవించగలుగుతున్నారు. ఈ కారణంగా దీనిని “97% డెత్ రేట్” వైరస్‌గా పరిగణిస్తున్నారు. నిపుణుల సూచనల ప్రకారం పాత స్విమ్మింగ్ పూల్స్‌లో ఈతకు దూరంగా ఉండాలి. నిలకడగా ఉన్న నీటిలో తల ముంచకూడదు. ముక్కులో నీరు పోకుండా జాగ్రత్త వహించాలి. ‘బ్రెయిన్ ఈటింగ్ అమీబా’ మళ్లీ తలెత్తడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఆరోగ్య శాఖ అధికారులు(Health Department Officers) స్పందించి సంబంధిత నీటిని పరీక్షలకు పంపించారు. ఈ వైరస్ విషయంలో ఎటువంటి నిర్లక్ష్యానికి తావులేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.