అక్షరటుడే, వెబ్‌డెస్క్: Viral Video | బైక్ డ్రైవ్ చేసేటప్పుడు హెల్మెట్ పెట్టుకోవాలని పోలీసులు, సినీ సెలబ్రిటీలు(Movie Celebrities) ఎంత మొత్తుకున్నా కూడా కొందరు పెడచెవిన పెట్టేస్తారు. అయితే కేరళలో బస్సు డ్రైవర్ హెల్మెట్ పెట్టుకొని డ్రైవ్ చేస్తుండడం అందరి దృష్టిని ఆకర్షించింది. దేశవ్యాప్తంగా జరుగుతున్న కార్మిక సంఘాల సమ్మె నేపథ్యంలో కేరళ(Kerala)లో జరిగిన ఈ సంఘటన అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. సమ్మెలో భాగంగా హింసాత్మక ఘటనలు జరిగే అవకాశం ఉండడంతో, కేరళ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (KSRTC)కి చెందిన ఓ డ్రైవర్ హెల్మెట్(Driver Helmet) ధరించి బస్సు నడిపిన దృశ్యం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
పతనంతిట్ట నుంచి కొల్లాం వెళ్తున్న బస్సును నడుపుతున్న షిబు థామస్ అనే డ్రైవర్, ముందు జాగ్రత్తగా హెల్మెట్ ధరించి బస్సు డ్రైవ్ చేశాడు. ఆయన తీసుకున్న ఈ ప్రత్యేక భద్రత చర్యను బస్సులోని కండక్టర్ (Conductor) వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది క్షణాల్లో వైరల్ అయింది. ఈ వీడియో ఇప్పుడు సమ్మె తీవ్రతపై చర్చలకు దారితీసింది. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు పిలుపునిచ్చిన ఈ సమ్మెపై కేరళ ప్రభుత్వం(Kerala Government) కఠిన వైఖరి చేపట్టింది. రవాణా శాఖ మంత్రి కేబీ గణేశ్ కుమార్(Transport Minister KB Ganesh Kumar) .. బస్సులు యథావిధిగా నడుస్తాయని, ప్రభుత్వ కార్యకలాపాల్లో అంతరాయం కలిగించే ప్రయత్నాలను సహించబోమని తెలిపారు.
‘డైస్ నాన్’ నిబంధన ప్రకారం సమ్మెలో పాల్గొనే ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఆ రోజు జీతం, ఇతర సర్వీసు ప్రయోజనాలు లభించవని ప్రభుత్వం హెచ్చరించింది. అనధికారిక సెలవులకు అనుమతి లేదని స్పష్టం చేసింది. ఇదే సమయంలో CITU, INTUC లాంటి ప్రధాన కార్మిక సంఘాలు మాత్రం ప్రభుత్వ హెచ్చరికలను ఖండించాయి. KSRTC కార్మికులు కూడా సమ్మెలో పాల్గొంటారని ప్రకటించడంతో ప్రభుత్వం vs కార్మిక సంఘాలు మధ్య ఉద్రిక్తత మరింత ముదిరింది.