అక్షరటుడే, వెబ్‌డెస్క్ : CM Revanth Reddy | ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై విరుచుకుపడ్డారు. కేసీఆర్‌వి (KCR) సోయిలేని మాటలని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మాజీ సీఎం కేసీఆర్ ఇటీవల తెలంగాణ భవన్లో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్‌రెడ్డిపై (Chief Minister Revanth Reddy) విమర్శలు చేసిన విషయం తెలిసిందే. కొడంగల్ నియోజకవర్గం కోస్గిలో బుధవారం సీఎం కొత్తగా ఎన్నికైన సర్పంచులను సన్మానించారు. అనంతరం ఆయన కేసీఆర్ వ్యాఖ్యలపై స్పందించారు. కేసీఆర్ ఉడత ఊపులకు భయపడేవాడిని కాదన్నారు. ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు అసెంబ్లీ పెడతానని చెప్పారు. పార్టీ ఆఫీసులో కాదు.. అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని సవాల్ విసిరారు. కూలిన కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్ అనేక అంశాలపై చర్చిద్దాం అన్నారు.
CM Revanth Reddy | మా సర్పంచులు తోలు తీస్తారు
కేసీఆర్ కొడంగల్‌కు వస్తారా.. లేదా తమను చింతమడకకు రమ్మంటావా అంటూ రేవంత్ ప్రశ్నించారు. కేసీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం (Congress government) తోలు తీస్తామన్న విషయం తెలిసిందే. దీనిపై రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ..‘‘నువ్వు కాదు మా సర్పంచ్ లు వచ్చి నీ తోలు తీస్తారు, చింతమడకలో వేలాడదీసి కొడతారు” అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ వి సోయి లేని మాటలు, స్థాయి లేని విమర్శలు అన్నారు.
CM Revanth Reddy | నన్ను గెలకకు
తనతో తమాషాలు చేయొద్దని కేసీఆర్‌కు రేవంత్‌రెడ్డి సూచించారు. తాను దుబాయ్ పాస్ పోర్టుల దందా చేయలేదన్నారు. దుబాయికి పంపుతా అని చెప్పి ఎవర్నీ మోసం చేయలేదని చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ దందా నడుపుతుంది అంటున్నారని, కేటీఆర్ ఏమో రియల్ ఎస్టేట్ పడిపోయింది అంటున్నారని విమర్శించారు. తనను గెలకొద్దని కేసీఆర్‌కు సూచించారు. తాను మాట్లాడితే కేసీఆర్ మెడకు రాయి కట్టుకుని చచ్చిపోతాడని సంచలన వ్యాఖ్యలు చేశారు.
CM Revanth Reddy | అధికారంలోకి రానివ్వను
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 2/3 సీట్లతో రెండోసారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని సీఎం అన్నారు. చేతనేతే కాసుకో బిడ్డా అని సవాల్ విసిరారు. తాను రాజకీయం చేసినంత కాలం కల్వకుంట్ల కుటుంబాన్ని అధికారంలోకి రానివ్వనని శపథం చేశారు. పదేళ్లు పాలించి పాలమూరును ఎండాబెట్టారని విమర్శించారు. వేసుకోవడానికి బట్టలు కూడా లేని దగ్గర్నుంచి ఇవాళ వేల ఎకరాల్లో ఫామ్ హౌస్‌లు కట్టుకునే వరకు ఎదిగారని ఆరోపించారు.