అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Assembly Sessions | తెలంగాణలో డిసెంబర్ 29 నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలు రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారాయి. ఈ సమావేశాలకు బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) హాజరుకానున్నారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
శుక్రవారం ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో (Erravalli Farmhouse) మాజీ మంత్రులతో జరిగిన కీలక సమావేశంలోనే ఈ విషయాన్ని కేసీఆర్ వెల్లడించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏ అంశాలపై ప్రశ్నించాలి, ఏ రీతిలో దాడి చేయాలి అన్నదానిపై ఆయన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలకు స్పష్టమైన దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. అదే సందర్భంలో తాను కూడా ఈసారి అసెంబ్లీకి హాజరవుతానని కేసీఆర్ చెప్పినట్లు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Assembly Sessions | అందరి దృష్టి ఆ రోజు పైనే..!
కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్నప్పటికీ, కేసీఆర్ ఇప్పటివరకు అసెంబ్లీ వేదికపై ప్రభుత్వాన్ని ప్రత్యక్షంగా ప్రశ్నించలేదు. ఈ నేపథ్యంలో ఆయన సభకు రానున్నారనే వార్త బీఆర్ఎస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి సర్కార్‌పై కేసీఆర్ ప్రత్యక్షంగా విమర్శలు చేస్తే, అసెంబ్లీ సమావేశాలు మరింత ఉత్కంఠభరితంగా మారతాయన్న అంచనాలు ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, పాలనలో లోపాలు, హామీల అమలుపై కేసీఆర్ ప్రశ్నల వర్షం కురిపించే అవకాశం ఉందని బీఆర్ఎస్ నాయకులు భావిస్తున్నారు.
ఒకవేళ కేసీఆర్ నిజంగానే అసెంబ్లీకి హాజరైతే, ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడం ఖాయమని బీఆర్ఎస్ కార్యకర్తలు ధీమాగా చెబుతున్నారు. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఆయన చేసే వ్యాఖ్యలు రాజకీయంగా పెద్ద దుమారం రేపే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరోవైపు, కాంగ్రెస్ నేతలు కూడా ఈ సమావేశాలకు ప్రత్యేక వ్యూహంతో సిద్ధమవుతున్నట్లు సమాచారం. మొత్తానికి డిసెంబర్ 29 నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలు తెలంగాణ రాజకీయాల్లో కీలక మలుపుగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.