అక్షరటుడే, వెబ్‌డెస్క్: CM Revanth Reddy | జల వివాదాలను రేపి, వాటి ద్వారా లబ్ధి పొందాలని మాజీ సీఎం కేసీఆర్ చూస్తున్నారని సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. గురువారం ఆయన ప్రజా భవన్లో మాట్లాడారు.
ప్రజాభవన్‌లో ‘నీళ్లు-నిజాలు’ అంశంపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి (Irrigation Minister Uttam Kumar Reddy) పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. నదీ జలాల కేటాయింపులు, బీఆర్ఎస్ ఆరోపణలపై చర్చించారు. శుక్రవారం అసెంబ్లీ సమావేశాల్లో (Assembly sessions) నదీ జలాలపై చర్చించనున్నారు. ఈ క్రమంలో మంత్రి, సీఎం నీటి వాటాలపై మంత్రులు, ఎమ్మెల్యేలకు అవగాహన కల్పించారు. బీఆర్ఎస్ హయాంలో చేసుకున్న ఒప్పందాల గురించి వివరించారు. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. పాలమూరు రంగారెడ్డి విషయంలో కేసీఆర్ (KCR) తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండి పడ్డారు. 90 శాతం పూర్తి చేశామని అబద్ధాలు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ప్రాజెక్ట్ కోసం రూ.27 వేల కోట్లు ఖర్చు చేశారని, ఇంకా రూ.80 వేల కోట్లు అవసరం అన్నారు. ఈ సమావేశం అనంతరం సీఎం మీడియాతో మాట్లాడారు.
CM Revanth Reddy | తప్పుదోవ పట్టిస్తున్నారు
నీటి హక్కుల కోసం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రజలకు, రైతాంగానికి న్యాయం చేయాలని ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాన్ని సమర్థించకపోయినా పర్లేదన్నారు. కానీ సంకుచిత స్వభావంతో ప్రభుత్వాన్ని విమర్శించడంతో పాటు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణా– గోదావరి జలాలను సక్రమంగా వాడుకుంటే రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందేదన్నారు.
CM Revanth Reddy | కేసీఆర్ సంతకం చేశారు
బీఆర్ఎస్ హయాంలో నీళ్ల విషయంలో పొరపాట్లు జరిగాయని సీఎం అన్నారు. వాటిని సరిచేస్తున్నామని చెప్పారు. ఉమ్మడి ఏపీకి కృష్ణా జలాల్లో 811 టీఎంసీల వాటా ఉండేదన్నారు. రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలు కేటాయించారని గుర్తు చేశారు. రాష్ట్రానికి 299 టీఎంసీలు చాలని కేసీఆర్ ఒప్పందంపై సంతకం చేశారని, ఇది ఏపీకి అడ్వాంటేజ్‌గా మారిందన్నారు. లెక్క ప్రకారం తెలంగాణకు కృష్ణా జలాల్లో 71శాతం వాటా రావాలన్నారు. ఎన్నికల్లో వరుస ఓటములతో బీఆర్ఎస్ మనుగడ కష్టం అవుతుందని కేసీఆర్ జల వివాదాలు రేపాలని చూస్తున్నట్లు ఆరోపించారు.