అక్షరటుడే, బాన్సువాడ: KCR Deeksha Divas | తెలంగాణ రాష్ట్ర సాధన దశ, దిశ మార్చిన ఘనత కేసీఆర్ కు మాత్రమే దక్కుతుందని మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ (Bajireddy Govardhan) అన్నారు. 16 ఏళ్ల క్రితం నవంబర్ 29న తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ (KCR) సచ్చుడో నినాదంతో నిరాహార దీక్షను కేసీఆర్ ప్రారంభించారన్నారు.
దీక్షా దివస్ (KCR Deeksha Divas) సందర్భంగా శనివారం బాన్సువాడ పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అంతకు ముందు బీఆర్ఎస్ కార్యకర్తలతో ర్యాలీగా వెళ్లి అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. కేసీఆర్ లేకుంటే తెలంగాణ లేదని, తెలంగాణ ఉద్యమానికి కేసీఆర్ ఊపిరి పోశారన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్లీ రావాలని ప్రజలు కోరుకుంటున్నారని పేర్కొన్నారు.
బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని దేశంలో నెంబర్ వన్ స్థానానికి తీసుకెళ్లారని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం పాలనలో అన్నిరకాలుగా విఫలమైందని ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజలకు అమలు కాని హామీలన్నీ ఇచ్చి ప్రస్తుతం చేతులెత్తేసిందని విమర్శించారు. కేసీఆర్ బాన్సువాడకు (Banswada) ఇచ్చినన్ని నిధులు ఏ నియోజవర్గానికి ఇవ్వలేదని తెలిపారు. రెండేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం రూ. 2.50 లక్షల కోట్లు అప్పులు చేసిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో రైతుబంధు సమితి జిల్లా మాజీ అధ్యక్షుడు అంజి రెడ్డి, మున్సిపల్ మాజీ వైస్ ఛైర్మన్ జుబేర్, మోచి గణేష్, సాయిబాబా, రమేష్ యాదవ్, నాయిని మొగులయ్య, బోడ చందర్, శివ సూరి, గౌస్ తదితరులు పాల్గొన్నారు.