అక్షరటుడే, వెబ్‌డెస్క్ : KCR | బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ మళ్లీ రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారు. పార్టీ బలోపేతంపై ఆయన దృష్టి పెట్టారు. దీంతో బీఆర్ఎస్లో జోష్ నెలకొంది.
రాష్ట్రంలో కాంగ్రెస్ (Congress) అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కేసీఆర్ రాజకీయాల్లో అంత యాక్టివ్‌గా లేరు. ఫామ్‌హౌజ్‌కే పరిమితం అయ్యారు. ఒకటి రెండు సార్లు అసెంబ్లీకి వచ్చినా.. మాట్లాడలేదు. బీఆర్ఎస్ రజతోత్సవ సభలో మాత్రమే ఆయన మాట్లాడారు. అయితే కేసీఆర్ యాక్టివ్‌గా లేకపోవడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో నిస్తేజం అలుముకుంది. ముఖ్యంగా కవిత వ్యవహారంతో పార్టీకి నష్టం జరిగింది. మరోవైపు కేటీఆర్ సారథ్యంలో బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల్లో (Parliament Elections) ఒక్క సీటు కూడా గెలవలేదు. రెండు ఉప ఎన్నికల్లో సైతం గులాబీ పార్టీ ఓడిపోయింది. అయితే ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ మెజారిటీ స్థానాలో గెలిచినా.. బీఆర్ఎస్ గట్టి పోటినిచ్చింది. దీంతో రానున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేయాలని కేసీఆర్ భావిస్తున్నారు.
KCR | పార్టీ బలోపేతం కోసం..
బీఆర్ఎస్ (BRS) లో సంస్థగత కమిటీలు వేయలేదు. దీంతో పార్టీలో నాయకులు చాలా మంది యాక్టివ్‌గా లేరు. ఈ క్రమంలో త్వరలో మండల, జిల్లా కమిటీలను వేయడానికి పార్టీ చర్యలు చేపడుతోంది. అలాగే పార్టీ నాయకుల్లో జోష్ నింపడానికి కేసీఆర్ బయటకు వచ్చారు. ఇటీవల ఆయన తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ఎల్పీ సమావేశంలో మాట్లాడారు. పార్టీ నేతలకు కీలక సూచనలు చేశారు. అనంతరం చాలా రోజుల తర్వాత మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వంపై, సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy)పై తీవ్ర విమర్శలు చేశారు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఉలిక్కిపడింది. మంత్రులు, కాంగ్రెస్ నేతలు కేసీఆర్‌పై విరుచుకుపడుతున్నారు. అయితే కేసీఆర్ వ్యాఖ్యలతో పార్టీలో జోష్ వచ్చింది. మరోవైపు ఆయన బయటకు రావడంతో ప్రజల్లో సైతం చర్చ జరుగుతోంది.
KCR | నేడు కీలక సమావేశం
ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్ శుక్రవారం మధ్యాహ్నం 2గంటలకు కీలక సమావేశం నిర్వహించారు. కేటీఆర్, హరీష్ రావు (Harish Rao)తో పాటు ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల మాజీ మంత్రులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపైనా ఆయన దిశానిర్దేశం చేయనున్నారు. కాగా ఇటీవల కేసీఆర్ మాట్లాడుతూ.. 20 రోజుల్లో మహబూబ్‌నగర్‌లో బహిరంగ సభ పెడుతామని ప్రకటించారు. ఈ సమావేశంలో బహిరంగ సభల తేదీలపై ఆయన చర్చించనున్నారు.