అక్షరటుడే, వెబ్‌డెస్క్: Notices to KCR | ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు (SIT Officers) విచారణ వేగవంతం చేశారు. ఈ కేసులో మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు నోటీసులు ఇవ్వనున్నారు.
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) వ్యవహారంలో కేసీఆర్‌ను సిట్ అధికారులు విచారించేందుకు సిద్ధమయ్యారు. ఆయనకు ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో అధికారులు గురువారం నోటీసులు ఇవ్వనున్నారు. శుక్రవారం వ్యవసాయ క్షేత్రంలోనే మాజీ సీఎంను విచారించనున్నట్లు తెలిసింది. ఇప్పటికే అధికారులు నోటీసులు తీసుకొని ఎర్రవల్లి ఫామ్‌హౌజ్ (Erravalli Farmhouse)కు బయలు దేరినట్లు సమాచారం.
Notices to KCR | వరుస విచారణలు
ఫోన్ ట్యాపింగ్ కేసులో గత వారం, పది రోజులుగా బీఆర్ఎస్ ముఖ్య నేతలను సిట్ అధికారులు విచారించారు. మొదట మాజీ మంత్రి హరీశ్‌రావును ప్రశ్నించారు. అనంతరం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను విచారించారు. ఇటీవల మాజీ ఎంపీ సంతోష్‌రావును సైతం పిలిచారు. కేసీఆర్ కుటుంబ సభ్యులను విచారించిన అధికారులు పలు కీలక వివరాలు రాబట్టినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో తాజాగా కేసీఆర్‌ను సైతం విచారించేందుకు సిద్ధం అయ్యారు. దీంతో బీఆర్ఎస్ నాయకుల్లో అలజడి మొదలైంది.
Notices to KCR | ఎన్నికల వేళ..
రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల (Municipal Elections) సందడి నెలకొంది. నామినేషన్ల ప్రక్రియ జోరుగా సాగుతోంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ అధినేతతో పాటు ముఖ్య నేతలను సిట్ విచారిస్తుండటం గమనార్హం. ఓ వైపు కాంగ్రెస్ ప్రచారంలో దూసుకు పోతుంది. బీఆర్ఎస్ సైతం కాంగ్రెస్ కుంభకోణాలు చేసినట్లు పలు ఆరోపణలు చేసింది. అయితే ఫోన్ ట్యాపింగ్ విచారణతో బీఆర్ఎస్ (BRS) శ్రేణులు కొంత ఆందోళనకు గురి అవుతున్నాయి. ఎన్నికల్లో ఈ వ్యవహారం పార్టీకి ఏమైనా నష్టం చేస్తుందా అని భయపడుతున్నారు.