HomeతెలంగాణCM Revanth Reddy | రాష్ట్రానికి నష్టం చేసిన కేసీఆర్​, హరీశ్​ రావు : సీఎం...

CM Revanth Reddy | రాష్ట్రానికి నష్టం చేసిన కేసీఆర్​, హరీశ్​ రావు : సీఎం రేవంత్​రెడ్డి

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: CM Revanth Reddy | రాష్ట్రానికి మాజీ సీఎం కేసీఆర్​ (KCR), మాజీ మంత్రి హరీశ్​రావు (Harish Rao) తీవ్ర నష్టం చేశారని ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) అన్నారు.

ఏపీ ప్రభుత్వం నిర్మించతలపెట్టిన బనకచర్ల ప్రాజెక్ట్ (Banakacherla Project)​పై హైదరాబాద్​లోని ప్రజాభవన్​లో సీఎం పవర్​ పాయింట్​ ప్రజెంటేషన్​ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్​ఎస్​ హయాంలో నీటి పారుదల శాఖను కేసీఆర్​, హరీశ్​రావు చూశారన్నారు. రాష్ట్ర హక్కులను కాపాడాల్సిన వారు నష్టం చేశారని రేవంత్​రెడ్డి వ్యాఖ్యానించారు. 811 టీఎంసీల్లో తెలంగాణకు 299 టీఎంసీలు చాలని.. 68 శాతం జలాలు ఏపీకి కేటాయిస్తే అభ్యంతరం లేదని 2015లోనే సంతకం చేశారని పేర్కొన్నారు. ఆ సంతకాలే తెలంగాణకు మరణశాసనంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు.

CM Revanth Reddy | ఎత్తిపోసిన నీరు సముద్రంలోకి..

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్​లో రూ.38వేల కోట్లతో ప్రాణహిత-చేవెళ్ల (Pranahitha – Chevella ) ప్రాజెక్ట్​ నిర్మాణానికి శ్రీకారం చుట్టారన్నారు. అయితే బీఆర్​ఎస్​ (BRS) అధికారంలోకి వచ్చాక దానిని పక్కన పెట్టి కాళేశ్వరం (Kaleswharam Project) ఎత్తిపోతలు నిర్మించిందన్నారు. రూ.లక్ష కోట్లతో నిర్మించిన ఈ ప్రాజెక్ట్​తో ఇప్పటి వరకు 168 టీఎంసీల నీరు మాత్రమే ఎత్తిపోశారని ఆయన పేర్కొన్నారు. అందులో 118 టీఎంసీలు మళ్లీ సముద్రంలోకి వెళ్లాయన్నారు. కాళేశ్వరం ద్వారా 50 వేల ఎకరాలకే అదనంగా సాగు నీరు అందించారని తెలిపారు. ఎత్తిపోతల ద్వారా కరెంట్​ బిల్లు రూ.7 వేల కోట్లు వచ్చిందన్నారు.

CM Revanth Reddy | అప్పుడు మాట్లాడలేదు

ఏపీలో జగన్ (YS Jagan) సీఎంగా ఉన్నన్ని రోజులు ఆ రాష్ట్రం నిర్మిస్తున్న ప్రాజెక్టుల గురించి కేసీఆర్​ మాట్లాడలేదన్నారు. జగన్​ ఓడిపోయి.. చంద్రబాబు సీఎం కాగానే జలాల సెంటిమెంట్‌తో రెచ్చగొడుతున్నారని విమర్శించారు. నీటి కేటాయింపుల విషయంలో తమ ప్రభుత్వం రాజీపడబోదని సీఎం స్పష్టం చేశారు. తెలంగాణ హక్కుల కోసం పోరాడుతామన్నారు.

CM Revanth Reddy | అది తాత్కాలికమే..

బనకచర్ల ప్రాజెక్ట్​కు అనుమతులు ఇవ్వలేమని ఇటీవల కేంద్ర నిపుణుల కమిటీ తెలిపిన విషయం తెలిసిందే. బనకచర్ల ప్రాజెక్టు ప్రతిపాదనను కేంద్రం తిప్పి పంపడం తాత్కాలికమేనని సీఎం అన్నారు. ఈ ప్రాజెక్టును కేంద్రం పూర్తిగా తిరస్కరించలేదని చెప్పారు. పునఃపరిశీలన తర్వాత మళ్లీ తెరమీదకు వస్తుందని ఆయన అభిప్రాయ పడ్డారు.

CM Revanth Reddy | కేసీఆర్​ను బతికించే పనిలో కిషన్ రెడ్డి

కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డి (Union Minister Kishan Reddy) కేసీఆర్‌ని బతికించే పనిలో ఉన్నారని సీఎం సంచలన వ్యాఖ్యలు చేశారు. కిషన్‌రెడ్డి మాట్లాడే ప్రతి మాట కేటీఆర్‌ ఆఫీసు నుంచి వస్తుందని ఆరోపించారు. నీటి కేటాయింపుల గురించి కిషన్‌రెడ్డి ఎందుకు మాట్లాడట్లేదు అని ప్రశ్నించారు. ఏపీ నుంచి కేంద్రంలో ఉన్న మంత్రులు రోజూ దిల్లీలో ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు. తాము కిషన్‌రెడ్డి దగ్గరికి వెళ్తే.. ఎప్పుడూ కేంద్ర మంత్రి దగ్గరికి తీసుకుపోలేదన్నారు. తమ కంటే ముందే వెళ్లి ఆయన కేంద్ర మంత్రులను కలుస్తున్నారని పేర్కొన్నారు. కిషన్‌రెడ్డి తీరు అనుమానాలు కలిగిస్తున్నాయని సీఎం అన్నారు.