అక్షరటుడే, వెబ్‌డెస్క్ : High Court | బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావుకు హైకోర్టులో చుక్కెదురైంది. పీసీ ఘోష్ కమిషన్ (PC Ghosh Commission) నివేదికపై స్టే ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది. అలాగే, మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసేందుకు సైతం ఇలాగే స్పందించింది.
అసెంబ్లీలో చర్చ చేసే వరకూ ఎలాంటి క్రిమినల్ చర్యలు చేపట్టబోమని ప్రభుత్వం తెలిపినందున మధ్యంతర ఉత్తర్వులు అవసరం లేదని అభిప్రాయపడింది. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో (Kaleshwaram Project) చోటు చేసుకున్న అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను కొట్టివేయాలంటూ కేసీఆర్, హరీశ్‌రావు దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు (High Court) గురువారం కూడా విచారణ జరిపింది. ఈ సందర్భంగా పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై ప్రభుత్వ నిర్ణయాన్ని కోర్టుకు ఏజీ శుక్రవారం తెలియజేశారు.
High Court | చర్చ తర్వాతే తదుపరి చర్యలు..
కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ అందించిన నివేదికపై ఇప్పటికిప్పుడే చర్యలు ఉండవని అడ్వొకేట్ జనరల్ హైకోర్టుకు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టి, అందరి అభిప్రాయాలు సేకరించాకే తదుపరి చర్యలు చేపడతామని పేర్కొన్నారు. ఆ తర్వాతే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అంటే.. అసెంబ్లీలో చర్చించిన అనంతరం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని కోర్టుకు ఏజీ వివరించారు. పిటిషనర్లు కేసీఆర్ (KCR), హరీశ్‌రావు (Harish Rao) ఇద్దరు కూడా శాసనసభ సభ్యులుగా ఉన్నందున అసెంబ్లీలో చర్చ తర్వాతే తదుపరి చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు ఆర్నెళ్ల సమయం ఉంటుందని తెలిపారు. ఏజీ వాదనలతో ఏకీభవించిన హైకోర్టు.. నివేదికపై స్టే విధించేందుకు నిరాకరించింది.
High Court | నివేదికను తొలగించాలి..
మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలన్న పిటిషనర్ల విజ్ఞప్తిని న్యాయస్థానం తోసిపుచ్చింది. హైకోర్టు విచారణ పూర్తయ్యే వరకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవద్దని తెలిపింది. కాళేశ్వరం కమిషన్ (Kaleshwaram Commission) నివేదికను ఎందుకు బహిరంగ పరచారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అయితే, తాము నివేదికను విడుదల చేయలేదని ఏజీ తెలిపారు. ఒకవేళ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక పబ్లిక్ డొమైన్‌లో ఉంటే వెంటనే తొలగించాలని కోర్టు ఆదేశించింది. మరోవైపు, పిటిషనర్లు చేసిన వాదనలతో ఏకీభవించని న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు అవసరం లేదని పేర్కొంది.
క్రిమినల్ చర్యలు తీసుకోబోమని ప్రభుత్వం చెబుతుందని, అసెంబ్లీలో చర్చ తర్వాత తదుపరి చర్యలు ఉంటాయని స్పష్టంగా చెబుతున్న తరుణంలో కోర్టు ఆదేశాలు అవసరం లేదని పేర్కొంది. అదే సమయంలో పిటిషనర్లు లేవనెత్తిన అభ్యంతరాలపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి మూడు వారాల గడువు విధించింది. హరీష్ రావు తరఫు న్యాయవాది సుందరం తన వాదనలు వినిపిస్తూ.. మొత్తం కమిషన్ నివేదికపై స్టే ఇవ్వాలని కోరారు. ఈ నివేదికను అడ్డం పెట్టుకుని తమ పిటిషనర్లపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని ఆయన కోర్టుకు విన్నవించారు. ఈ నేపథ్యంలో తమ వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కోరుతున్నామని కోర్టు దృష్టికి న్యాయవాది సుందరం తీసుకువెళ్లారు.
అంతేకాకుండా.. జస్టిస్ పీసీ ఘోష్ నివేదికను అసెంబ్లీలో కంటే.. ముందే మీడియాకు ఇచ్చి.. తమ పిటిషనర్ల పరువుకు భంగం కలిగించారని కోర్టుకు న్యాయవాది సుందరం తెలిపారు. తమకు 8B, 8C కింద నోటీసు ఇవ్వలేదని కోర్టుకు తెలిపారు. దీంతో హైకోర్టు న్యాయమూర్తలు జోక్యం చేసుకుని.. 8B నోటీస్ కాకుండా సెక్షన్ 5(1) ఎందుకు ఇచ్చారంటూ ప్రభుత్వ తరఫు నాయ్యవాది ఏజీని సూటిగా ప్రశ్నించారు. తాము ఇచ్చిన నోటీస్ 8B లాంటి నోటీసని కోర్టుకు ఏజీ తెలిపారు. హరీష్ రావు, కేసీఆర్ అసెంబ్లీలో సభ్యులుగా ఉన్నారని ఈ సందర్భంగా కోర్టుకు గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో ఈ నివేదిక పెట్టిన తర్వాతే చర్యలు తీసుకుంటామన్న ఏజీ వెల్లడించారు. ఈ నేపథ్యంలో తదుపరి విచారణను నాలుగు వారాల పాటు వాయిదా వేసింది.