అక్షరటుడే, వెబ్‌డెస్క్: KCR | రాష్ట్ర ప్రభుత్వంపై బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఫైర్ అయ్యారు. ఇది చేతగాని దద్దమ్మ ప్రభుత్వమని మండిపడ్డారు. ఇప్పటి వరకు ఒక లాగా అని.. ఇక నుంచి మరోలా ఉంటుందని.. ఇక తోలు తీస్తామని వ్యాఖ్యానించారు. తెలంగాణ భవన్లో ఆదివారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీలు నేతలు ఎన్నికల ముందు అర్రస్ పాట పాడినట్లు హామీలు ఇచ్చారని మండిపడ్డారు. పెన్షన్లు, కల్యాణ లక్ష్మి, రెండు లక్షల రుణమాఫీ అంటూ హామీలు ఇచ్చారని చెప్పారు. 420 హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేశారన్నారు. ఇష్టం వచ్చినట్లు హామీలు ఇచ్చి శఠగోపం పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని పంటలకు బోనస్ అని చెప్పి ఇప్పుడు దేనికీ దిక్కులేదన్నారు. చివరికి యూరియా సప్లయ్ చేసే దిక్కులేదన్నారు. యూరియా కోసం రైతులు చెప్పుల లైన్లు పెట్టాల్సిన గతి మళ్లీ తెచ్చారన్నారు. వాళ్ల నోటికి మొక్కాలన్నారు.
KCR | ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇక నుంచి మరో లెక్క
తెలంగాణకు రాష్ట్ర ప్రభుత్వం అన్యాయం చేసిందన్నారు. పాలమూరు ఎత్తిపోతల విషయంలో చేతగాని దద్దమ్మలా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. 80 శాతం పనులు పూర్తయిన ప్రాజెక్టులో ఒక తట్ట మట్టి ఎత్తిపోయలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉందా.. నిద్రపోతుందా అని ప్రశ్నించారు. ఎంత సేపు ప్రభుత్వ భూములు అమ్మడం.. కమీషన్ల కోసం పనిచేస్తుందంటూ విమర్శించారు. రెండేళ్ల నుంచి వేచి చూశానన్నారు. ఇక నుంచి రంగంలోకి దిగి పోరాటంలోకి దిగుతానన్నారు. అడ్డం పొడువు మాట్లాడితే ఊరుకోబోమన్నారు.
KCR | పాలమూరు రంగారెడ్డిపై చర్చ
బీఆర్ఎస్ సమావేశంలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై చర్చించామని కేసీఆర్ తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో పాలమూరు వివక్షకు గురైందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణకు చేస్తున్న ద్రోహంపై చర్చ జరిగిందన్నారు. కృష్ణా నది పారేది కూడా మహబూబ్‌నగర్ జిల్లాలోనేనన్నారు. ఈ జిల్లాలోనే 308 కిలోమీటర్లు ప్రవహిస్తుందని పేర్కొన్నారు. ఏపీ ఏర్పాటుతో మహబూబ్‌నగర్ జిల్లాకు తీవ్ర అన్యాయం జరిగిందని చెప్పారు. పాలమూరు ఎత్తిపోతల కొత్త ప్రాజెక్టు ఏమీ కాదన్నారు. ఈ ప్రాంతం నిర్లక్ష్యానికి గురైందని బచావత్ ట్రిబ్యూనల్ చెప్పిందన్నారు. సమైక్య పాలకులు కేటాయించకపోయినా జూరాల ప్రాజెక్టుకు బచావత్ కమిషన్ నీళ్లు కేటాయించిందన్నారు.
KCR | చంద్రబాబు దత్తత తీసుకుని అన్యాయం చేశారు
ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మహబూబ్‌నగర్ జిల్లాను దత్తత తీసుకున్నారని కేసీఆర్ గుర్తు చేశారన్నారు. అయినా ఈ ప్రాంతానికి ఎంతో అన్యాయం చేశారన్నారు. దీనిపై తాము ఎంతో పోరాటం చేశామని చెప్పారు. ఆనాటి పాలకులు పాలమూరు జిల్లాను వెనబడేశారన్నారు. నాడు 330 కిలోమీటర్ల కృష్ణా నది పారే జిల్లాలో 30వేల ఎకరాల భూమి కూడా సాగులో లేదన్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత ఈ జిల్లాపై పూర్తిగా అధ్యయనం చేశామని పేర్కొన్నారు. యుద్ధప్రాతిపదికన పెండింగ్‌లో పెట్టిన ప్రాజెక్టులను పూర్తి చేశామన్నారు. నెట్టంపాడు, బీమా, కల్వకుర్తి తదితర ప్రాజెక్టులు పూర్తి చేసి ఆరున్నర లక్షల ఎకరాలను సస్యశామలం చేశామని చెప్పారు.
తాము అధికారంలోకి వచ్చాక భూములకు నీళ్లు ఇచ్చామన్నారు. మిషన్ కాకతీయలో అత్యధిక ప్రాధాన్యం ఇచ్చి చెరువులను అభివృద్ధి చేశామన్నారు. నల్గొండ, రంగారెడ్డి, పాలమూరు జిల్లాల్లో కురిసిన వర్షాల నీళ్లు కృష్ణా నదిలోకే వెళ్తాయన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టామని వివరించారు. ఈ పథకానికి 170 టీఎంసీలు తీసుకోవాలని నిర్ణయించామన్నారు. ఈ ప్రాజెక్టుకు తాము 90.81 టీఎంసీలు కేటాయించామన్నారు. ప్రాజెక్టు కోసం 145 మెగా వాట్ల కెపాసిటీ పంపులు ఏర్పాటు చేశామని తెలిపారు. రూ. 35వేల కోట్లు మంజూరు చేశామన్నారు. దాదాపు 80 శాతం పనులు పూర్తయ్యాయయన్నారు. ఇంతలో ప్రభుత్వం మారిందని చెప్పారు. కానీ ప్రస్తుత తెలివి తక్కువ ప్రభుత్వం తట్టెడు మట్టి కూడా తీయకుండా వదిలేసిందన్నారు. రెండేళ్లు దాటినా కూడా ఎందుకు పట్టించుకోలేదో అర్థం కాలేదన్నారు. దీని వెనుక ఎవరి ఒత్తిడి ఉందని ప్రశ్నించారు.
KCR | తెలంగాణకు శనిగా బీజేపీ
తెలంగాణకు శనిగా బీజేపీ మారిందని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ఎన్డీయేలో ఉండడంతో ఆయన చెప్పినట్లు విని తెలంగాణకు అన్యాయం చేస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్టు డీపీఆర్‌ను రాష్ట్రానికి తిరిగి పంపిందన్నారు. దీనిపై ఆకాశం ఒక్కటి చేయాల్సిన ప్రస్తుత ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. దీని వెనక ఎవరు ఉన్నారని.. ఎవరి కుట్ర ఉందని వ్యాఖ్యానించారు. పాలమూరుకు అన్యాయం చేయడంపై పోరాటాలు చేస్తామని పేర్కొన్నారు. అందరినీ కలుపుకుని ముందుకు సాగుతామన్నారు. బహిరంగ సభలు పెడతామని ప్రకటించారు. ఇది సర్వభ్రష్ట ప్రభుత్వం అన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా.. నిద్రపోతుందా అని ప్రశ్నించారు.