అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Jubilee Hills | జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో (Jubilee Hills election) గెలుపు కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఈ క్రమంలో బీఆర్ఎస్ తాజాగా అభ్యర్థిని ప్రకటించింది.
జూబ్లీహిల్స్ స్థానం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సతీమణి సునీత (Maganti Sunitha) పేరును పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. ఈ మేరకు శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. ఇక్కడ బీఆర్ఎస్ నుంచి గెలిచిన మాగంటి గోపినాథ్ అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో ఉప ఎన్నిక నిర్వహించనున్నారు. త్వరలో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు (Bihar Assembly elections) జరగనున్నాయి. అప్పుడే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు (Jubilee Hills by-election) కూడా ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది.
Jubilee Hills | సిట్టింగ్ స్థానాన్ని నిలుపుకోవాలని..
తమ సిట్టింగ్ స్థానాన్ని నిలుపుకోవాలని బీఆర్ఎస్ యత్నిస్తోంది. ఈ మేరకు ఇప్పటికే మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ నియోజకవర్గ నేతలతో పలుమార్లు సమావేశం నిర్వహించారు. గెలుపే లక్ష్యంగా పని చేయాలని కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. కాంగ్రెస్‌కు (Congress) ఓటు వేస్తే ఇళ్లను కూల్చడానికి పర్మిషన్ ఇచ్చినట్లే అని వ్యాఖ్యలు చేశారు. కాగా కాంగ్రెస్ సైతం ఇక్కడ గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తోంది. ఈ క్రమంలో తాజాగా బీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించింది.
Jubilee Hills | కాంగ్రెస్ నుంచి ఎవరో..
జూబ్లీహిల్స్ టికెట్ (Jubilee Hills ticket) కోసం కాంగ్రెస్‌లో పోటీ నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో పోటీ చేసి ఓడిపోయిన అజారుద్దీన్ టికెట్ ఆశించారు. అయితే కాంగ్రెస్ ఆయను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ చేసింది. ఈ సీటును బీసీలకు ఇవ్వడానికి ప్రయత్నిస్తామని పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ అన్నారు. మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్ ఇక్కడి నుంచి పోటీ చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. పార్టీ తనకు టికెట్ ఇస్తుందని ఆయన ధీమా కనబరుస్తున్నారు. నగరంలో కీలకమైన యాదవ సామాజిక వర్గానికి చెందిన తనకు టికెట్ ఇచ్చి, గెలిచాక మంత్రిని చేయాలని ఆయన గతంలో అన్నారు. టికెట్‌పై ఎలాంటి ప్రకటన రాకున్నా.. ఆయన మాత్రం నియోజకవర్గంలో పోస్టర్లు వేస్తున్నారు.