అక్షరటుడే, వెబ్‌డెస్క్: Phone Tapping Case | ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో శుక్రవారం ఆయన హైదరాబాద్‌లోని దిల్కుషా గెస్ట్‌హౌస్‌లో (Dilkusha Guest House) విచారణకు హాజరయ్యారు. బీఆర్ఎస్ హయాంలో బండి సంజయ్ ఫోన్ ట్యాప్ అయినట్లు గుర్తించిన అధికారులు ఆయన స్టేట్మెంట్ రికార్డు చేశారు. గంట పాటు అధికారులు ఆయన వాంగ్మూలం నమోదు చేశారు. బండి సంజయ్ తన వద్ద ఉన్న ఆధారాలను అధికారులకు అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
మాజీ సీఎం కేసీఆర్‌కు (Former CM KCR) బంధాలతో సంబంధం లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కుటుంబ సభ్యుల ఫోన్లను కూడా ఆయన ట్యాప్ చేశారని ఆరోపించారు. మావోయిస్టుల పేరుతో తమ ఫోన్లను ట్యాప్ చేసినట్లు సిట్ అధికారులకు తెలిపారన్నారు. ఆ లిస్ట్‌లో మాజీ మంత్రి, కేసీఆర్ అల్లుడు హరీశ్‌రావు (Harish Rao), సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) పేరు కూడా ఉందన్నారు. సీఎం కేసీఆర్ కుమార్తె, అల్లుడు ఫోన్లను కూడా బీఆర్ఎస్ హయాంలో ట్యాప్ చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Phone Tapping Case | ఆ వివరాలు చూసి షాక్ అయ్యా..
బీఆర్ఎస్ హయాంలో తన ఫోన్‌నే ఎక్కువగా ట్యాప్ చేసినట్లు బండి సంజయ్ (Bandi Sanjay) తెలిపారు. తన ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించి సిట్ అధికారులు ఇచ్చిన వివరాలు చసి షాక్‌కు గురైనట్లు ఆయన పేర్కొన్నారు. ట్యాపింగ్ జరుగుతోందని అప్పట్లోనే చెప్పినట్లు గుర్తు చేశారు. బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు తనపై నిఘా పెట్టారన్నారు. తన ఇంట్లో సిబ్బంది ఫోన్లను కూడా ట్యాప్ చేశారని చెప్పారు. తన కుటుంబ సభ్యులతో పాటు తన ఓఎస్డీ, వ్యక్తిగత సిబ్బంది ఫోన్ ట్యాప్ అయినట్లు అధికారులు చెప్పారన్నారు.
Phone Tapping Case | దుర్వినియోగం చేశారు
మావోల కార్యకలపాలను తెలుసుకోవడం, వారిని నియంత్రించడం కోసం ఏర్పాటు చేసిన ఎస్ఐబీని కేసీఆర్ ప్రభుత్వం (KCR Government) దుర్వినియోగం చేసిందని బండి సంజయ్ ఆరోపించారు. ఎస్ఐబీని అడ్డం పెట్టుకుని వేలది ఫోన్లు ట్యాపింగ్ చేశారన్నారు. సిట్ వాళ్లు చూపించిన లిస్టు చూసి ఆశ్చర్యానికి గురైనట్లు తెలిపారు. కేసీఆర్ అనే మూర్ఖుడు, ట్విటర్ టిల్లు మావోలను పక్కనబెట్టి రాజకీయ నేతల ఫోన్లు ట్యాపింగ్‌కు (Phone Tapping) పాల్పడ్డారన్నారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేల ఫోన్లను కూడా ట్యాప్ చేశారన్నారు. భార్యాభర్తల మధ్య మాటలను కూడా విన్నారని, వీళ్లను ఏం చేసినా తప్పులేదన్నారు.
Phone Tapping Case | కాపాడేందుకు కాంగ్రెస్ యత్నం
బీఆర్ఎస్ నేతలను కేసుల నుంచి కాపాడేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) యత్నిస్తోందని సంజయ్ ఆరోపించారు. కేటీఆర్ చాలా మంది వ్యాపారుల ఫోన్లు వివరాలు విని రహస్యాలు తెలుసుకుని బ్లాక్‌మెయిల్ చేసి వేల కోట్లు సంపాదించారని ఆరోపించారు. దీనిపై అన్ని ఆధారాలున్నా రేవంత్‌రెడ్డి ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని నిలదీశారు. ఖమ్మం ఎంపీ అభ్యర్థి దగ్గర రూ.7 కోట్లు పట్టుకున్నారని, ఆ డబ్బులు ఏమయ్యాయని ప్రశ్నించారు. అప్పట్లో వందల కోట్లు సీజ్ చేశారని, అవన్నీ ఎటు పోయాయని నిలదీశారు. వేల కోట్ల అక్రమాలు జరిగితే రేవంత్ సర్కారు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. అక్రమాలపై ఈడీకి లేఖ రాస్తే అసలు విషయాలు బయటకు వస్తాయి కదా? అని అన్నారు.
Phone Tapping Case | సీబీఐకి ఇవ్వాలి..
బీఆర్ఎస్ పాలనలో జరిగిన అక్రమాలపై కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోదని బండి సంజయ్ అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 20 నెలలైనా కేసీఆర్ కుటుంబలో ఒక్కరినైనా అరెస్టు చేశారా? అని ప్రశ్నించారు. కమిషన్ల పేరిట కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. సిట్ విచారణ వల్ల జరిగేదేమీ ఉండదని, సీబీఐకి అప్పగించాలన్నారు. రేవంత్‌రెడ్డి ఫోన్లు ట్యాపింగ్ చేసినట్లు తెలిసినా ఆయనను ఎందుకు విచారణకు పిలవడం లేదని ప్రశ్నించారు. జడ్జీలను పిలిచి విచారణ చేసే అధికారం సిట్‌కు ఉందా? ముఖ్యమంత్రిని విచారించే అధికారం ఉందా? అని అడిగారు.
Phone Tapping Case | కాంగ్రెస్‌కు కప్పం కడుతున్న బీఆర్ఎస్
ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం, డ్రగ్ కేసు మీద కమిషన్ల మీద కమిషన్లు వేస్తున్నారని, అది కాలయపనకేనని, ఎలాంటి చర్యలు తీసుకోరన్నారు. బీఆర్ఎస్ నేతలను కాంగ్రెస్ ప్రభుత్వం ఏమీ చేయలేదని, వారు కాంగ్రెస్ నేతలకు వందల కోట్లు అప్పగిస్తున్నారన్నారు. కాళేశ్వరం కేసీఆర్‌కు ఏటీఎంగా మారితే, కేసీఆర్ కుటుంబం అవినీతి కాంగ్రెస్ నాయకత్వానికి ఏటీఎంగా మారిందని ఆరోపించారు.