అక్షరటుడే, వెబ్డెస్క్ : Guvvala Balaraju | అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే, నాగర్ కర్నూల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు గువ్వల బాలరాజు ఇటీవల పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. మంగళవారం ఆయన పలు టీవీ ఛానెళ్లతో మాట్లాడారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం కేసీఆర్ కుటుంబం (KCR Family) కొంత బాధలో ఉందని ఆయన అన్నారు. తాను బాధ పెట్టదల్చుకోలేదని చెప్పారు. బీఆర్‌ఎస్‌కు రెండ్రోజుల క్రితమే రాజీనామా చేశానన్నారు.
Guvvala Balaraju | వ్యక్తిగత కారణాలతోనే..
తాను వ్యక్తిగత కారణాలతోనే పార్టీకి రాజీనామా చేసినట్లు గువ్వల బాలరాజు తెలిపారు. దేశ, రాష్ట్ర ప్రయోజనాలు నెరవేరాలంటే జాతీయ పార్టీతో (National Party) సాధ్యమన్నారు. బీఆర్ఎస్ జాతీయ పార్టీగా ఎదుగుతుందని తాను భావించినట్లు చెప్పారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో బీఆర్ఎస్ జాతీయ పార్టీగా ఎదిగే అవకాశాలు లేవని ఆయన చెప్పారు. దీంతో తన ఆశయాలకు అనుగుణంగా ఉండే పార్టీలో చేరడానికి రాజీనామా చేశానని వెల్లడించారు.
Guvvala Balaraju | విలీనం గురించి మాట్లాడలేదు
బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతుందని తాను ఎక్కడ చెప్పలేదని గువ్వల అన్నారు. దాని గురించి మాట్లాడలేదని స్పష్టం చేశారు. కాగా బీఆర్ఎస్ పార్టీ (BRS Party) బీజేపీలో విలీనం అవుతుందని, అందుకే ముందుగా తాను రాజీనామా చేసినట్లు గువ్వల పేరుతో ఓ కాల్ రికార్డింగ్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై ఆయన స్పందించారు. బీఆర్ఎస్పై తాను ఎలాంటి ఆరోపణలు చేయలేదని ఆయన చెప్పారు. తనకు అవకాశం ఇచ్చిన బీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్కు (KCR) తన రాజీనామా లేఖలో కృతజ్ఞత తెలిపినట్లు పేర్కొన్నారు.
Guvvala Balaraju | కేసీఆర్ చెప్పడంతో వెళ్లా..
గతంలో రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌కు చెందిన నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలు కోసం ప్రయత్నాలు జరిగిన విషయం తెలిసిందే. ఇందులో గువ్వల బాలరాజ్ (Guvvala Balaraju) కూడా ఉన్నారు. అయితే ఆ రోజు ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి యత్నించింది ఎవరో ఇంకా తెలియదన్నారు. ఆ కేసు విచారణలో ఉందని చెప్పారు. అప్పుడు కేసీఆర్ చెప్పడంతోనే తాను అక్కడకు వెళ్లానని స్పష్టం చేశారు. ఎవరు కొనుగోలుకు యత్నించారు, ఎవరు అమ్ముడు పోయారనే విషయాలు విచారణలో తెలుతాయన్నారు.
Guvvala Balaraju | ఏ పార్టీలో చేరాలో డిసైడ్ కాలే..
బీఆర్‌ఎస్‌కు రాజీనామా (BRS Resignation) చేసిన తాను ఏ పార్టీలో చేరాలో ఇంకా నిర్ణయించుకోలేదని గువ్వల బాలరాజు తెలిపారు. ఆయన ఆగస్టు 9న బీజేపీలో చేరుతారని ప్రచారం జరిగింది. దీనిపై ఆయన స్పందిస్తూ.. బీజేపీలో చేరుతున్నట్లు తాను ఎక్కడా చెప్పలేదన్నారు. కాంగ్రెస్‌లోకి రావాలని పెద్ద పెద్ద నేతలు అడుగుతున్నారని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కూడా తమ నియోజకవర్గానికి చెందినవారే అని పేర్కొన్నారు. కేసులకు భయపడి పార్టీకి రాజీనామా చేశాననడంలో వాస్తవం లేదన్నారు. ఏ పార్టీలో చేరేది అనుచరులతో చర్చించి ప్రకటిస్తానని ఆయన వెల్లడించారు.