అక్షరటుడే, వెబ్‌డెస్క్: KCR | భారత రాష్ట్ర సమితిలో కొన్నాళ్లుగా జరుగుతున్న పరిణామాలపై ఆ పార్టీ అధినేత కేసీఆర్ స్పందించడం లేదు. ఎమ్మెల్సీ కవిత లేఖ (Kavitha Letter) బయటకు రావడం, ఆమె బహిరంగంగానే ధిక్కార స్వరం వినిపిస్తుండడంపై ఆయన నోరు విప్పడం లేదు. ఈ నేపథ్యంలో కేసీఆర్ (KCR) కావాలనే వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారా..? అన్నది ఇప్పుడు రాష్ట్ర (State) వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సొంతింట్లో చెలరేగిన ఆధిపత్య పోరుతో కలత చెందిన పెద్దాయన కావాలనే మౌనంగా ఉంటున్నారనే ప్రచారం జరుగుతోంది. అన్నాచెల్లె మధ్య మొదలైన వివాదాన్ని వీలైనంత త్వరగా ఆయన పరిష్కరిస్తారని, ఇదంతా టీ కప్పులో తుఫాన్ లాంటిదేనని బీఆర్ఎస్ నేతలు(BRS leaders) చెబుతున్నారు. కానీ కవిత చేసిన వ్యాఖ్యలు ఇద్దరి మధ్య తీవ్రదూరం పెంచాయని, ఇద్దరు కలిసిపోవడం దాదాపు అసాధ్యమనే భావన వ్యక్తమవుతోంది.
KCR | తండ్రిపై కవిత ఆక్షేపణలు..
బీఆర్ఎస్‌తో పాటు రాష్ట్ర రాజకీయాల్లో (State Politics) కవిత ప్రస్తుతం కేంద్ర బిందువుగా మారారు. ఆమె తన తండ్రికి రాసిన లేఖ బయటకు రావడం, అమెరికా(america) నుంచి వచ్చాక కవిత చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్‌ను తీవ్ర సంక్షోభంలోకి నెట్టాయి. బీజేపీలో(BJP) బీఆర్ఎస్‌ను విలీనం చేసే ప్రక్రియ జరిగిందని, అందుకు వ్యతిరేకించడంతో తనను కేసీఆర్‌కు(KCR) దూరం చేసే కుట్రలు జరుగుతున్నాయని కవిత (Kavitha) ప్రకటించారు. అదే సమయంలో పదేళ్ల నుంచి పార్టీలో తాను అనేక అవమానాలు పడ్డానని చెప్పారు. అదే సమయంలో తన తండ్రి దేవుడని, ఆయనే మా నాయకుడన్న కవిత.. కేసీఆర్‌ను ఆక్షేపిస్తూ వ్యాఖ్యలు చేయడం వెనుక మర్మమేమిటో ఎవరికీ అంతు చిక్కడం లేదు. ‘బీసీ రిజర్వేషన్లు (BC Reservations), మహిళా బిల్లు వంటి కీలక అంశాలపై పోరాడదామని తాను చెప్పినప్పటికీ కేసీఆర్ పట్టించుకోలేదని.. కొత్త వారికి పార్టీలో అవకాశం కల్పిద్దామని చెప్పినా స్పందించలేదని.. పదేళ్లలో సామాజిక తెలంగాణ తేలేదని’ కవిత వ్యాఖ్యానించి కేసీఆర్‌ను ఇబ్బందుల్లోకి నెట్టారు. మరోవైపు, తెలంగాణ జాగృతి కొత్త కార్యాలయ ప్రారంభోత్సవంలో మాట్లాడుతూ.. కాళేశ్వరం కమిషన్ (Kaleshwaram Commission) కేసీఆర్‌కు నోటీసులు ఇవ్వడాన్ని కవిత తీవ్రంగా ఖండించారు. నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ ఆందోళనకు సిద్ధమయ్యారు. కేసీఆర్‌పై ఈగ వాలినా ఊరుకోమని హెచ్చరించారు. తండ్రిని ఆక్షేపిస్తూనే, ఆయనకు మద్దతుగా కవిత పోరుబాట బట్టడం వెనుక కారణాలేమిటన్నది ఎవరికీ అంతు చిక్కడం లేదు.
KCR | మౌనంగానే కేసీఆర్..
కవిత ఎపిసోడ్ తర్వాత గులాబీ శ్రేణుల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. బీఆర్ఎస్ రజతోత్సవ సభ (BRS silver jubilee assembly) సక్సెస్ తర్వాత పార్టీలో ఏర్పడిన కొత్త జోష్ కాస్త కవిత ఎపిసోడ్‌తో ఆవిరైంది. సొంత సోదరుడితో పాటు కన్న తండ్రిపై కవిత విమర్శలు ఎక్కుపెడుతుండడంతో ఆమె కొత్త పార్టీ (New Party) పెట్టుకుంటుందన్న ప్రచారం జరిగింది. కానీ వాటిని ఖండించిన కవిత.. కేసీఆర్ నాయకత్వంలోనే పని చేస్తానని చెబుతోంది. బీఆర్ఎస్‌తో పాటు సొంత కుటుంబంలో చెలరేగిన సంక్షోభంపై కేసీఆర్ (KCR) ఇప్పటిదాకా స్పందించలేదు. ఆయన కావాలనే వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాళేశ్వరం కమిషన్ నోటీసులు (Kaleshwaram Commission notices) ఇచ్చిన సమయంలోనే కవిత ధిక్కార వైఖరి కేసీఆర్‌ను తీవ్ర ఆందోళనకు గురి చేసింది. ఇంట్లో రేకెత్తిన ఈ సంక్షోభాన్ని కేసీఆర్ పరిష్కరిస్తారని, దానికి గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కీలక నేతలు కొట్టి పడేస్తున్నారు. కవిత వ్యవహారంలో ఎవరూ స్పందించొద్దని, ఎలాంటి వ్యాఖ్యలు చేయద్దని గులాబీ బాస్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడంతో పార్టీ నేతలు బహిరంగంగా స్పందించడం లేదు. అయితే, టీ కప్పులో తుఫానేనని, కొద్ది రోజుల్లో అంత సద్దుమణుగుతుందని వారు చెబుతున్నారు.