అక్షరటుడే, వెబ్‌డెస్క్ : CM Revanth Reddy | నిజాం కంటే ధనవంతుడు కావాలనే దురాశతో కేసీఆర్ ప్రాణహిత–చేవేళ్ల ప్రాజెక్ట్ రీడిజైన్ చేసి, కాళేశ్వరం (Kaleshwaram) నిర్మించారని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఆదివారం కాళేశ్వరంపై చర్చలో ఆయన మాట్లాడారు.
ప్రాణహిత–చేవేళ్ల నిర్మాణానికి తమ్మిడిహట్టి దగ్గర నీరు అందుబాటులో ఉన్నాయని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి 2014 నాటి నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావుకు లేఖ రాశారన్నారు. సెంట్రల్ వాటర్ కమిషన్ (CWC) సైతం 2009, 2014లో అక్కడ నీరు అందుబాటులో ఉందని చెప్పిందన్నారు. అయినా కూడా హరీశ్ రావు (Harish Rao) సభను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
CM Revanth Reddy | కేంద్రం అనుమతి ఇచ్చినా..
తమ్మిడిహట్టి వద్ద 205 టీఎంసీల నీరు అందుబాటులో ఉందని నాటి కేంద్ర మంత్రి ఉమాభారతి లేఖలో పేర్కొన్నారని సీఎం చెప్పారు. ప్రాణహిత–చేవేళ్ల ప్రాజెక్ట్ నిర్మించుకోవడానికి అనుమతి ఇచ్చారని చెప్పారు. నీరు అందుబాటులో ఉందని కేంద్ర మంత్రి లేఖ రాసినా.. మళ్లీ హరీశ్‌రావు పరిశీలించాలని ఎందుకు లేఖ రాశారని ప్రశ్నించారు. ఊరు మార్చి, పేరు మార్చి, అంచనాలు పెంచి తెలంగాణ ప్రజల సొమ్మును కొల్లగట్టాలని ఆలోచనతో తప్పుడు పనులు చేశారన్నారని ఆరోపించారు. దోపిడీకి పాల్పడి ఇప్పుడు సభను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు.
CM Revanth Reddy | మహారాష్ట్ర అడ్డు చెప్పలేదు
మహారాష్ట్ర (Maharashtra) ప్రభుత్వం తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు కట్టొద్దని ఎప్పుడూ చెప్పలేదని, ఎత్తు తగ్గించుకోవాలని మాత్రమే వాళ్లు సూచించారన్నారు. 148 మీటర్ల ఎత్తులో కట్టుకోవడానికి ఆ ప్రభుత్వం ఓకే చెప్పిందన్నారు. 152 మీటర్లు కట్టుకుంటే 160 టీఎంసీలు తీసుకుంటామని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కోరిందన్నారు. అయితే 152 మీటర్లు కడితే తమ భూమి ముంపు పెరుగుతుందని మహారాష్ట్ర వాదించిందన్నారు. ప్రాజెక్టు నిర్మించుకుంటామని వాదించకుండా.. పేరు మార్చి, ఊరు మార్చి బీఆర్ఎస్ వాళ్లు దోపిడీకి పాల్పడ్డారన్నారని విమర్శించారు.
CM Revanth Reddy | మేడిగడ్డ విషయంలో అదే చెప్పింది
ఉమాభారతి లేఖలో మొదటి రెండు పేజీలు మాత్రమే సీఎం చదివారని హరీశ్‌రావు అన్నారు. మూడో పేజీల్లో నీళ్లు అందుబాటులో లేకుంటే ప్రాజెక్ట్ నిర్మాణం విషయంలో ఆలోచించాలని చెప్పారన్నారు. అందుకే మేడిగడ్డకు ప్రాజెక్ట్‌ను మార్చినట్లు చెప్పారు. దీనిపై సీఎం రేవంత్‌రెడ్డి స్పందిస్తూ.. మేడిగడ్డ విషయంలో కూడా సీడబ్ల్యూసీ ఇదే విధంగా హెచ్చరించిందన్నారు. అక్కడ నీరు అందుబాటులో లేకుంటే పునరాలోచన చేయాలని చెప్పిందన్నారు. ప్రతి ప్రాజెక్ట్ విషయంలో సీడబ్ల్యూసీ ఈ హెచ్చరిక చేస్తుందన్నారు. మేడిగడ్డ దగ్గర కూడా సీడబ్ల్యూసీ కాషన్ చెప్పినా ఎందుకు కట్టారని ప్రశ్నించారు.
CM Revanth Reddy | హరీశ్‌రావు తప్పు చేశారు
నిజాం కంటే శ్రీమంతుడు కావాలనే దురాశతో నాటి సీఎం కేసీఆర్ ప్రాజెక్ట్ స్థలం మార్చారన్నారు. ఈ మేరకు రిటైర్డ్ ఇంజినీర్లతో కమిటీ ఏర్పాటు చేశారన్నారు. ఆ కమిటీ కూడా మేడిగడ్డ దగ్గర కట్టొద్దని చెప్పిందన్నారు. ఆ రిపోర్టును కూడా తొక్కిపెట్టారని ఆరోపించారు. ఆ నివేదిక కనిపించకుండా అప్పటి మంత్రి హరీశ్‌రావు చేశారన్నారు. హరీశ్‌రావు తప్పు చేశారని పీసీ ఘోష్ (PC Gosh) కమిషన్ స్పష్టం చేసిందన్నారు. కమిషన్ వాస్తవాలు బయటపెట్టడంతోనే హరీశ్‌రావు విషం చిమ్ముతున్నారని విమర్శించారు.
CM Revanth Reddy | మామ, బావమరిది ఒత్తిడితో..
నిపుణుల కమిటీ రిపోర్ట్‌పై పీసీ ఘోష్ కమిషన్ హరీశ్‌రావును ప్రశ్నించిందని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఈ నివేదిక వచ్చిందని హరీశ్‌రావు కమిషన్‌కు చెప్పారన్నారు. తన మామ, తన బావమరిది దోపిడీకి పాల్పడాలని దానిని తొక్కి పెట్టారని ఆయన నిస్సహాయతను పరోక్షంగా ఒప్పుకున్నారని కమిషన్ తెలిపిందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.