అక్షరటుడే, హైదరాబాద్: KCR | అసెంబ్లీ ఎన్నికల్లో భారాస ఓటమి తర్వాత గులాబీ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (Former CM KCR) ఫాంహౌస్‌కే పరిమితమయ్యారు. అసలు మీడియా ముందుకు వచ్చిందే లేదు. ఎన్నికల్లో ఓడిపోయాక కనీసం ప్రజలకు సందేశం కూడా ఇవ్వలేదు. ఇటీవల జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతోపాటు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి సమీక్షలు, పార్టీ నేతలతో మీటింగ్‌లను అక్కడి నుంచే నిర్వహిస్తూ వచ్చారు. ఈ రెండేళ్ల కాలంలో కేసీఆర్ తెలంగాణ ప్రజలకు కనిపించింది చాలా తక్కువే. కాగా, చాలా రోజుల తర్వాత కేసీఆర్ బయటకు వచ్చారు.
తెలంగాణ భవన్‌కు ఆదివారం కేసీఆర్ చేరుకున్నారు. సాగునీటి హక్కుల రక్షణ కోసం గళం విప్పారు. సీఎం రేవంత్‌పై ఫైర్ అయ్యారు. ఫ్యూచర్ సిటీని తీసి పారేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనను, కేంద్రంలో బీజేపీ పాలనను దుయ్యబట్టారు.
KCR | పార్టీ శ్రేణుల్లో జోష్..
భారాస చీఫ్ కేసీఆర్ చాలా రోజుల తర్వాత బయటకు వచ్చి, తన ప్రసంగంతో పార్టీ శ్రేణుల్లో జోష్ నింపారు. అధికార కాంగ్రెస్ పార్టీకి ఒకింత ముచ్చెమటలే పట్టించారని అంటున్నారు. నదీ జలాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంపై సమరశంఖం పూరించారు. తెలంగాణ సాగునీటి హక్కుల రక్షణ కోసం ప్రజా ఉద్యమంపై పార్టీ నేతలకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.
KCR | ఇప్పటి వరకు కేటీఆరే అన్నీ తానై..
అసెంబ్లీ Assembly ఎన్నికల తర్వాత కేసీఆర్ ఫాంహౌస్‌కే పరిమితం కావడంతో భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆరే అన్నీ తానై నడిచారు. గత రెండేళ్లుగా అధికార కాంగ్రెస్‌కు ప్రతిపక్ష పాత్రను పోషిస్తూ వచ్చారు. సీఎం రేవంత్ చేసే ప్రతి పనిని విమర్శిస్తూ.. ప్రజలకు వివరించేవారు. పార్టీ శ్రేణులకు సందేశం ఇచ్చేవారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలోనూ పెద్దన్న పాత్ర పోషించారు. హరీశ్‌రావు అడపా దడపా మీడియాతో మాట్లాడేవారు. పార్టీ ఆక్టివిటీస్‌లో పాలుపంచుకునేవారు.
దాదాపు రెండేళ్ల తర్వాత పార్టీ అధినేత బయటకు రావడంతో బీఆర్ఎస్ శ్రేణులు సంబరపడిపోతున్నారు. ఇక తెలంగాణ మలి దశ ఉద్యమం రోజులు వస్తాయని, తాము మళ్లీ ప్రజా వ్యతిరేక పోరాటంలో యాక్టీవ్‌గా ఉంటామని భావిస్తున్నారు. కాగా, ఒకింత వారిలో భయం కూడా లేకపోలేదు. ఇది రెండు రోజుల సంబరమా.. లేక కంటిన్యూగా ప్రజలకు అందుబాటులో ఉంటారా.. ఒకవేళ ప్రజలకు, పార్టీ శ్రేణులకు అందుబాటులో లేకుండా తిరిగి, ఫాంహౌస్‌కే పరిమితం అయితే పరిస్థితి ఏమిటని సందేహపడుతున్నారు.