అక్షరటుడే, వెబ్‌డెస్క్ : SIT Investigation | ఫోన్ ట్యాపింగ్ కేసు (Phone Tapping Case)లో సిట్ విచారణ కోసం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్ నందినగర్‌లోని తన నివాసానికి చేరుకున్నారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి ఆయనను అధికారులు విచారించనున్నారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరు కావాలని సిట్ అధికారులు (SIT Officers) కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఆదివారం ఆయన ఎర్రవల్లిలోన తన వ్యవసాయ క్షేత్రం నుంచి నంది నగర్ బయలు దేరారు. ఆయనతో పాటు బీఆర్ఎస్ శ్రేణులు, నాయకులు పెద్ద ఎత్తున రాగా.. మార్గమధ్యలో పోలీసులు అడ్డుకున్నారు. కేసీఆర్ కాన్వాయ్‌ను మాత్రమే పంపించారు. అనంతరం కేసీఆర్ నంది నగర్ (Nandi Nagar)లోని తన నివాసంలోకి చేరుకున్నారు.
SIT Investigation | రెండో ఫ్లోర్లో విచారణ
నంది నగర్‌లోని కేసీఆర్ (KCR) ఇంటికి నాయకులు, కార్యకర్తలను పోలీసులు అనుమతించడం లేదు. అక్కడికి భారీగా బీఆర్ఎస్ శ్రేణులు తరలిరాగా పోలీసులు అడ్డుకుంటున్నారు. కేసీఆర్ కుటుంబ సభ్యులు కేటీఆర్ (KTR), హరీశ్‌రావు (Harish Rao), సంతోష్‌రావును మాత్రమే ఇంట్లోకి అనుమతించారు. కేసీఆర్‌ను రెండో ఫ్లోర్లో అధికారులు ప్రశ్నించనున్నారు. ఇప్పటికే సిట్ అధికారులు ఆయన ఇంటికి చేరుకున్నారు. కేసీఆర్ ఒక్కరినే విచారణ గదిలోకి సిట్ అనుమతించే అవకాశం ఉంది. విచారణను అధికారులు వీడియో రికార్డు చేయనున్నారు.
కేసీఆర్ నివాసం వద్ద నాలుగు అంచెల పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆ మార్గంలో రాకపోకలను నిలిపివేశారు. ఎవరిని అనుమతించడం లేదు. అలాగే చుట్టు పక్కల సైతం బీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళన చేపట్టకుండా చర్యలు చేపట్టారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు నిరసన తెలుపుతున్నాయి. సిట్ నోటీసులకు వ్యతిరేకంగా ఆందోళన నిర్వహిస్తున్నాయి. సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) దిష్టిబొమ్మలను బీఆర్ఎస్ నాయకులు దహనం చేస్తున్నారు.