అక్షరటుడే, వెబ్‌డెస్క్: Kalvakuntla Kavitha | తెలంగాణ రాజకీయాలు రోజురోజుకు మరింత వేడెక్కుతున్నాయి. ఈ మధ్యకాలంలో ఎవరిని కదిలించినా జాగృతి చీఫ్ కల్వకుంట్ల కవిత గురించే చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ పార్టీ (BRS Party) నుంచి సస్పెన్షన్ ఎదుర్కొన్న అనంతరం ఆమె ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. భారాస నుంచి సస్పెండ్ అయిన తర్వాత ఆ పార్టీ వల్ల లభించిన పదవి తనకు వద్దంటూ కవిత తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు.
మండలి ఛైర్మన్‌కు రిజైన్ లెటర్‌ను కవిత పంపించి ఆమోదం తెలపాలని విన్నవించారు. ఎమ్మెల్సీ కవిత రాజీనామాను శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutta Sukhender Reddy) ఆమోదించారు. అయితే ఈ పరిణామాల మధ్యనే, తెలంగాణ జాగృతి రాజకీయ పార్టీగా అవతరించబోతుందనే సంకేతాలను కవిత పరోక్షంగా ఇచ్చారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
Kalvakuntla Kavitha | కవిత ఏం చెప్పనుంది?
ఈ నేపథ్యంలో మంగళవారం (జనవరి 6) తెలంగాణ జాగృతి రాష్ట్ర విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం నిర్వహించడం మరింత ప్రాధాన్యం దక్కించుకుంది. హైదరాబాద్‌లోని తెలంగాణ జాగృతి (Telangana Jagruthi) ప్రధాన కార్యాలయంలో కవిత అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి జాగృతి అనుబంధంగా ఉన్న 23 సంస్థల నేతలు హాజరయ్యారు.ఈ సమావేశంలో రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, రానున్న ఎన్నికల వ్యూహం, కొత్త పార్టీ ఏర్పాటు వంటి కీలక అంశాలపై విస్తృతంగా చర్చ జరిగినట్లు సమాచారం. ముఖ్యంగా తెలంగాణ జాగృతిని రాజకీయ పార్టీగా ప్రకటించడంపై లోతైన చర్చ జరిగినట్లు తెలిసింది. అంతేకాకుండా, 2026 ఫిబ్రవరి 16 లేదా 20వ తేదీన మంచిర్యాల (Mancherial)లో భారీ బహిరంగ సభ నిర్వహించాలని ఈ సమావేశంలో నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇదే సభ వేదికగా కొత్త రాజకీయ పార్టీని అధికారికంగా ప్రకటించే అవకాశముందని రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది.
మంచిర్యాలలోనే సభ నిర్వహించడానికి గల కారణాలపై కూడా ఆసక్తికర అంశాలు బయటకు వస్తున్నాయి. కవిత గతంలో టీజీబీకేఎస్ (తెలంగాణ గని బొగ్గు కార్మిక సంఘం) గౌరవ అధ్యక్షురాలిగా పని చేసిన నేపథ్యం ఉండటంతో, సింగరేణి కార్మికుల్లో (Singareni Workers) ఆమెకు మంచి పట్టు ఉందని నాయకులు భావిస్తున్నారు. ఆ ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకునే మంచిర్యాల కేంద్రంగా సభ పెట్టాలని నిర్ణయించినట్లు సమాచారం. అంతేకాదు, భవిష్యత్తులో కవిత మంచిర్యాల నుంచే పోటీ చేసే అంశంపై కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చినట్లు తెలిసింది. ఈ నియోజకవర్గం నుంచి బరిలో దిగితే రాజకీయంగా ఆమెకు మరింత అనుకూలంగా ఉంటుందని సన్నిహితులు, కార్మిక నేతలు సూచించినట్లు టాక్. ఇక ఈ సమావేశానికి కవిత ఇద్దరు కొడుకులు హాజరు కావడం రాజకీయ వర్గాల్లో మరో కొత్త చర్చకు దారి తీసింది. సాధారణంగా రాజకీయ సమావేశాలకు కుటుంబ సభ్యులను తీసుకురాని కవిత, ఈసారి తన కుమారులను సమావేశానికి తీసుకురావడం వెనక ప్రత్యేక వ్యూహం ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.